సినీ పరిశ్రమను నిలదీసిన ఎంపి

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమను వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు రెచ్చగొడుతున్నారు. సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ తయారుచేస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వెబ్ సైట్ ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని తన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర చరిత్రలో సినిమా టికెట్ల అమ్మకాన్ని ఒక వెబ్ సైట్ ద్వారా కంట్రోల్ చేయడం ఇదే మొదటిసారి. దీనివల్ల లాభమా ? నష్టమా ? అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది.

లాభ, నష్టాలను పక్కన పెట్టేస్తే టికెట్ల అమ్మకాన్ని వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వం కంట్రోల్ చేయాలని అనుకోవటంపై సిని పరిశ్రమలోని పెద్దలు ఎవరు నోరు విప్పలేదు. సినీ పరిశ్రమకు పెద్ద అనిపించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్న చిరంజీవి కూడా ఎక్కడా మాట్లాడలేదు. మరి పరిశ్రమలోని ప్రముఖులు నలుగురు కలిసినప్పుడు ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో తెలీదు. ఉత్తర్వులు జారీ అయి 48 గంటలైనా అధికారికంగా ఎవరు మాట్లాడలేదన్నది వాస్తవం. చివరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నోరు విప్పలేదు.

మామూలుగా అయితే విషయం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయటంలో అత్యుత్సాహం చూపించే పవన్ కూడా ఎందుకు నోరిప్పటంలేదో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడే ప్రముఖులు సినీ పరిశ్రమలో చాలా మందున్నారు. మరి వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా నోరిప్పలేదు. ఇలాంటి సమయంలోనే తిరుగుబాటు ఎంపి రంగంలోకి దిగారు.

ఏపీ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిశ్రమలోని పెద్దలను పలు ప్రశ్నలు వేశారు. సినిమాల గురించి జగన్ కు ఏమి తెలుసన్నారు ? సినిమా టికెట్లపై ప్రభుత్వం పెత్తనమేంటని నిలదీశారు. పరిశ్రమకు ఇంత జరుగుతున్నా పరిశ్రమలోని పెద్దలు ఎందుకు నోరిప్పటం లేదంటు తెగ బాధపడిపోయారు. గతంలో ఘట్టమనేని కృష్ణ లాంటి పట్టించుకునేవారని గుర్తుచేశారు. ఇపుడు చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి వారు కూడా పట్టించుకోకపోవటం అన్యాయమని ఆక్రోశించారు.

అందరి సంగతిని పక్కనపెట్టేస్తే సినీపరిశ్రమపై ఆధారపడిన పవన్ కల్యాణ్ కూడా ఎందుకు నోరిప్పటం లేదని ఆశ్చర్యపోయారు. ఇప్పటికైనా సినీ పరిశ్రమ ఒక్కటై ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలని పిలుపిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘కందుకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అనే సామెత గుర్తుకొస్తోంది జనాలకు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పరిశ్రమకు అన్యాయం జరుగుతుందని అనుకుంటే సినీపెద్దలు నోరిప్పకుండానే ఉంటారా ?

అయినా ఎందుకని నోరిప్పకుండా కూర్చున్నారు ? అంటే ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టం లేదని అనుకున్నారా ? లేకపోతే నాలుగు రోజులు పోయిన తర్వాత లాభ, నష్టాలు చూసి అప్పుడు మాట్లాడుదామని అనుకున్నారా ? అన్నది తెలియదు.