మొన్న అంబటి రాంబాబు.. ఇప్పుడేమో అవంతి శ్రీనివాస్.. ఏపీలో అధికార పార్టీకి చెందిన నాయకులు రాసలీలల ఆడియో లీకులతో వరుసగా చిక్కుల్లో పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నపుడు ఆటోమేటిగ్గా అందరి చూపూ ప్రతిపక్ష పార్టీల మీద పడుతుంది. ఆ పార్టీల వాళ్లే ఆయా నేతల్ని టార్గెట్ చేసి ఉంటారని అనుకుంటారు.
కానీ అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ల విషయంలో మాత్రం వేరే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వాళ్లే వీళ్లను టార్గెట్ చేశారనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వైకాపాలోనే అసమ్మతి వర్గాలు, వీళ్లంటే గిట్టని నాయకులు పకడ్బందీగా ప్లాన్ చేసి వీళ్లను ఇరికించారనే అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటు అంబటికి, అటు అవంతికి వారి నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలున్నాయి. అంతర్గత కుమ్ములాటలు తక్కువేమీ కాదు. పై స్థాయిలో ఉన్న నాయకులకు వీరిపై మంచి అభిప్రాయం లేదని.. వేరే నేతలను ప్రోత్సహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని సైడ్ లైన్ చేయడానికి ప్లాన్ చేసి ఫోన్ కాల్స్ రికార్డు చేయడం.. వాటిని లీక్ చేయడం చేశారంటున్నారు.
అధికార పార్టీ నేతలను ఇలా టార్గెట్ చేసే స్థితిలో టీడీపీ, జనసేన వాళ్లయితే లేరు. వీళ్లను ముగ్గులోకి దించే వ్యక్తులు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే భరోసాతో అంత ధైర్యంగా ఈ పని చేయలేరు. కచ్చితంగా అధికార పార్టీ నేతల అండ ఉండటంతోనే ఇలాంటివి చేయగలిగారన్నది విశ్లేషకుల అంచనా. ఈ ఆడియో లీక్స్ ముందుగా వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న మీడియాకు చేరడాన్ని బట్టి కచ్చితంగా ఇది వైసీపీ వాళ్ల పనే అని.. పొమ్మనలేక పొగబెట్టే వ్యవహారంలా ఇది తయారైందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.