ఏపీలో ముంద‌స్తు.. ఢీల్లీ వ‌ర్గాల చ‌ర్చ‌లు…!

రాష్ట్ర ప్ర‌భుత్వ సార‌థి.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిస్థితి ఇబ్బందిగా మారిందా? ఆయ‌న కేంద్రంగా.. ఢిల్లీలో రాజ‌కీయాలు మారుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వివిధ కేసుల విష‌యంలో జ‌గ‌న్ బెయిల్ పొంది.. సీఎంగా గెలిచి.. పాల‌న సాగిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. జాతీయ స్తాయిలో మారుతున్న ప‌రిణామాలు.. జ‌గ‌న్‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా.. మ‌రో ఏడాదిలోనే రాష్ట్రంలో ముందస్తుకు ప్లాన్ చేస్తున్నార‌ని.. తెలుస్తోంది.

ఇప్పుడు ఇదే విషయం అన్ని వ‌ర్గాల్లోనూ చ‌ర్చకు దారితీసింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌పై అన్ని వైపుల నుంచి సైలెంట్ వార్ న‌డుస్తోంది. ఒక‌వైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు, మ‌రోవైపు వ్య‌తిరేక మీడియా.. ఇంకో వైపు.. త‌మ‌కు న‌మ్మ‌కంగా ఉన్న మిత్ర‌ప‌క్షం బీజేపీ.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఇలా.. అన్ని వైపుల నుంచి జ‌గ‌న్‌ను చుట్టుముట్టారు. జ‌గ‌న్ పాల‌నకు వాస్త‌వానికి రెండున్న‌రేళ్లు పూర్తి అవుతున్నాయి. కానీ, ఇంత‌లోనే వ్యూహాత్మ‌క దాడి జ‌రుగుతోంది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇలా జ‌రుగుతోంది. అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ఢిల్లీ వ‌ర్గాల మ‌ధ్య జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో ముందస్తు ఎన్నిక‌ల‌కు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం వైసీపీపై వ్య‌తిరేక‌త‌ను పెంచ‌డం.. దీనిలో ప్ర‌ధాన వ్యూహం. అదేస‌మ‌యంలో తాము బ‌లోపేతం కాక‌పోయినా.. త‌మ అనుకూల నాయ‌కుడు, త‌మ‌తో చేతులు క‌లిపిన నాయ‌కుడు.. బ‌లంగా త‌యార‌య్యేలా చూసుకుని.. జ‌గ‌న్‌కు ఏదో ఒక రూపంలో చెక్ పెట్టాల‌నేది.. బీజేపీ పెద్ద‌ల వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌గా మారింద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డం ఎవ‌రివ‌ల్లా సాధ్యం కాదు. కానీ, ఆర్థిక ప‌రిస్థితిని సాకుగా చూపి.. ఆయ‌న‌పై చర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. ఈ క్ర‌మంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విధించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఒక‌సారి ఇది ఇంప్లిమెంట్ అయి.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తే.. ఆటోమేటిక్‌గా ప్ర‌భుత్వం ర‌ద్దు చేసుకుని.. ఎన్నిక‌లకు వెళ్ల‌మ‌ని ఒత్తిడి తేవ‌చ్చ‌ని.. ఢిల్లీ బీజేపీ నేత‌ల ప్లాన్‌.

ఈ మొత్తం ప‌రిణామం అంతా.. రాబోయే ఆరు మాసాల్లో పూర్తి చేసుకుని.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఇతర రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు ఏపీకి ఎన్నిక‌లు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఈ వ్యూహంతోనే వైసీపీకి చెందిన రెబ‌ల్ ఎంపీ విష‌యంలో బీజేపీ నేత‌లు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని చెబుతున్నారు.