అవును ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి చెప్పుకుని తీరాలి. ఎందుకు చెప్పుకోవాలంటే ఒలంపిక్స్ లో పురుషుల, మహిళల హాకీ పోటీల్లో చూపించిన ప్రతిభకు యావత్ దేశం జేజేలు పలుకుతోంది. పురుషుల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించటంతో యావత్ దేశం ఫిదా అయిపోయింది. అది కూడా 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో మెడల్ సాధించటంతో యావత్ దేశం ఆనంద చెప్పనలవి కావట్లేదు. మెడల్ సంపాదించలేకపోయినా మహిళల జట్టు కూడా బాగానే పోరాడిందని అనిపించుకుంటోంది.
హాకీ జట్ల గురించి దేశం మొత్తం ఇపుడింత ఘనంగా చెప్పుకుంటోంది కానీ దీనికి అసలు కారకులు ఎవరో తెలుసా ? ఆయనే ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్. ఇరవైనాలుగు గంటలూ ప్రభుత్వ వ్యవహారాలతో, రాజకీయాల్లో మునిగిపోయుండే నవీన్ కు హాకీకి ఏం సంబంధమని ఆలోచిస్తున్నారా ? సంబంధం ఏమిటంటే నవీన్ స్వతహాగా హామీ ప్లేయరన్న విషయం చాలామందికి తెలీదు. డూన్ స్కూల్లో చదువుకునే రోజుల్లో నవీన్ మంచి గోల్ కీపరట. తర్వాత్తర్వాత హాకీని ఆడటం సాధ్యం కాకపోయినా రెగ్యులర్ గా మ్యాచులైతే చూస్తారట.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఒకపుడు పురుషుల, మహిళా హాకీ జట్లకు స్పాన్సరర్ గా సహారా ఇండియా ఉండేది. అది కేసులు తగులుకున్న తర్వాత 2017-18లో ఒప్పందాలను రద్దు చేసుకున్నదట. నిజానికి అప్పట్లో హాకీ జట్లంటే దేశంలో అందరికీ చిన్నచూపే. ఎందుకంటే మన దేశంలో హాకీ ఆట పూర్వవైభవాన్ని కోల్పోయి చాలా సంవత్సరాలైంది. చెప్పుకోదగ్గ విజయాలు లేవు, ప్రభుత్వం నుండే ప్రోత్సాహం లేదు. దాంతో సహారాకు ప్రత్యామ్నాయంగా స్పాన్సర్ చేయటానికి ఎవరు ముందుకు రాలేదు.
స్సాన్సర్ షిప్ కోసం ఇండియన్ హాకీ ఫెడరేషన్ చాలా కార్పొరేట్ కంపెనీల చుట్టూ తిరిగినా ఉపయోగం కనబడలేదు. ఆ దశలోనే ఫెడరేషన్ చేస్తున్న ప్రయత్నాలు నవీన్ దృష్టిలో పడింది. దాంతో వెంటనే ఫెడరేషన్ ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడారట. వాళ్ళ అవసరాలేమిటో ఫెడరేషన్ అధికారులు చెప్పారు. అంతా విన్న తర్వాత స్పాన్సర్ చేయటానికి నవీన్ అంగీకరించారు. 2018-23 మధ్య హాకీ ఫెడరేషన్ కు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఏటా ప్రభుత్వం రు. 100 కోట్లివ్వటానికి అంగీకరించింది.
జట్లు కప్పులు గెలుస్తాయో లేదో తెలీదు. జట్టులో ప్లేయర్ల ప్రతిభేమిటో కూడా నవీన్ చూడలేదు. ముందు నిధులు ఇచ్చిన తర్వాతే మిగిలిన విషయాల గురించి ఆలోచించాలని నవీన్ అనుకున్నారు. అందుకనే నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ప్రాక్టీస్ కి అవసరమైన అంతర్జాతీయ స్థాయి గ్రౌండ్లు, సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. నవీన్ పెట్టుకున్న నమ్మకం ఇపుడు నిజమైంది.
ఎప్పుడైతే పురుషుల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించిందో, మహిళల జట్టు మంచి ప్రతిభ చూపిందో వెంటనే కార్పొరేట్ కన్ను పడిపోయింది. రెండు జట్లను ప్రశంశలతో కార్పొరేట్ కంపెనీలు ముంచెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా వందల కోట్ల రూపాయలిచ్చి ప్రోత్సహించి, అవసరమైన సౌకర్యాలు కల్పించిన నవీన్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అందుకనే జనాలందరూ ఇపుడు నవీన్ ను దటీజ్ నవీన్ అంటున్నారు.