కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించటానికి అసంతృప్తే కారణమా ? బాబుల్ తీసుకున్న నిర్ణయం వెలువడగానే సంచలనంగా మారింది. ఎందుకంటే మొన్నటి మంత్రివర్గ ప్రక్షాళనలో నరేంద్రమోడి ఈ అసన్సోల్ ఎంపిని మంత్రిపదవిలో నుండి తీసేశారు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బాబుల్ ప్రస్తావించకుండా తాను రాజకీయాలకు గుబ్ బై చెబుతున్నట్లు ప్రకటించేశారు.
అంతేకాకుండా తొందరలోనే అసన్సోల్ నియోజకవర్గం ఎంపిగా కూడా రాజీనామా చేయబోతున్నట్లు చేసిన ప్రకటన బీజేపీలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్లో ప్రముఖ గాయకునిగా పేరున్న బాబుల్ 2014 ఎన్నికల్లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటిసారే ఎంపిగా గెలవటంతో పాటు కేంద్రంలో మంత్రికూడా అయిపోయారు. 2019 ఎన్నికల్లో రెండోసారి కూడా ఎంపిగా గెలిచిన బాబుల్ సుప్రియోను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
అయితే మొన్నటి ప్రక్షాళనలో తీసేశారు. మంత్రిగా తీసేయటం కన్నా తీసేసిన తీరుతోనే బాబుల్ బాగా అవమానంగా ఫీలైనట్లు ప్రచారంలో ఉంది. మోడి నేరుగా చెప్పకుండా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చెప్పించి రాజీనామా చేయించారు. దాంతో బాగా అవమానంగా ఫీలైన బాబుల్ రాజీనామా తర్వాత మళ్ళీ మోడిని కలవలేదట. నేరుగా బెంగాల్ కు వెళిపోయి తన మద్దుతుదారులతో, సన్నిహితులతో మాట్లాడిన తర్వాతే రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మొన్ననే జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బాబుల్ ను మోడి ఎంఎల్ఏగా పోటీచేయిస్తే ఆయన ఓడిపోయారు. స్ధానిక నేతల మధ్య ఉన్న విభేదాల వల్లే తాను ఓడిపోయినట్లు బాబులో ఫిర్యాదు చేశారట. బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్ తో కూడా బాబుల్ కు తీవ్రమైన విభేదాలున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్న తనను ఎంఎల్ఏగా పోటీచేయించటం, తన ఓటమికి స్ధానిక నేతలు కారణమవ్వటం, పార్టీలో విభేదాలు చివరగా కేంద్రమంత్రిగా తీసేయటం అంతా కలిపి రాజకీయాలంటేనే విరక్తి పుట్టినట్లుంది.
ఎంతైనా రాజకీయాలకు కొత్త కాబట్టి వెన్నుపోట్లు, ఎత్తుకు పై ఎత్తులు ఇంకా వంటపట్టినట్లులేదు. పైగా పార్టీలోను, మోడి దగ్గర జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోయారు. అందుకనే ఏకంగా రాజకీయాల నుండే తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు. మరి ఎంపిగా కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన బాబుల్ ఎప్పుడు చేసేది మాత్రం చెప్పలేదు. మరి ఎంపిగా కూడా రాజీనామా చేసిన తర్వాత ఏమవుతుందో చూడాల్సిందే.