ఇప్పుడున్న ప్రజల మైండ్ సెట్ ప్రకారం.. అధికారాన్ని నిలబెట్టుకోవడం.. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడం.. అనేది పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. ఏదో ఎన్నికలకు ముందు ఆరు మాసాలు కసరత్తు చేస్తే.. ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం పెద్ద కష్టం కాదు.. అనే పరిస్థితి ఇప్పుడు ఏపీ వంటి విభిన్న పార్టీలు, ప్రజలు ఉన్న రాష్ట్రంలో ఏమంత తేలిక కాదని అంటున్నారు పరిశీలకులు. బహుశ .. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టారో.. ఏమో.. వైసీపీ అధినేత, సీఎం జగన్.. వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు మూడేళ్ల నుంచి ఆయన అడుగులు వేయడం ప్రారంభించారు.
గత 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఇలానే వ్యవహరించింది. మూడేళ్ల ముందుగానే.. జగన్.. పాదయాత్ర ప్రారంభించి.. అందరినీ నిశ్చేష్టులను చేశారు. అప్పుడే పాదయాత్ర ఎందుకు? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ, జగన్ 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాను అనుకున్నది చేశారు. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో విజయం పై ఆయన ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. ఏవిధంగా ముందుకు సాగితే.. వచ్చ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటా మనే విషయంపై పెద్ద ఎత్తునే కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో పేదలకు అప్పులు చేసైనా సరే.. సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. సమయానికి ఇంటికే.. ఇంకా తెలతెలవారకుండానే పింఛన్లు అందిస్తున్నారు. అదే సమయంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. జగనన్న కాలనీల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇవన్నీ..పేదలకు ఉద్దేశించినవే. దీంతో పేదల ఓట్లు.. తనకే పడతాయనే ధీమా వైసీపీలో వ్యక్తమవుతోంది.
అంతేకాదు.. ఏ పార్టీ కూడా చేయనటువంటి సంక్షేమం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మహిళలకు పదవులు ఇస్తున్నాం కాబట్టి.. విజయం తమదేననే ధీమా వైసీపీలో వ్యక్తమవుతోంది. అయితే.. మధ్యతరగతి మాటేంటి? వారి ఓట్లు కూడా ఎన్నికల్లో కీలకమే కదా? అంటే.. అక్కడికే వస్తున్నారు..జగన్.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 3 సెంట్ల చొప్పున నామమాత్రపు ధరలకే వీటిని ఇవ్వనున్నారు. అదే సమయంలో మధ్యతరగతి వర్గాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న పెట్రోల్ సమస్యకు కూడా చెక్ పెట్టేలా వ్యూహాత్కమంగా అడుగులు వేస్తున్నారు. మధ్యతరగతి వర్గాలకు లోన్ ప్రాతిపదికన ప్రభుత్వమే.. బ్యాటరీ వాహనాలు అందించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దీనిపై ఒక కమిటీని కూడా నియమించనున్నారు.
వచ్చే ఆరు మాసాల్లో దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నట్టు తెలిసింది. ఇలా.. మధ్యతరగతి వర్గం ఓట్లను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మొత్తంగా వర్గాలను విభజించి.. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేలా వైసీపీ ప్లాన్ చేస్తుంటే.. టీడీపీ మాత్రం చోద్యం చూస్తోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates