రేవంత్‌కు షాక్‌… ఆయ‌న కారెక్కేస్తున్నారుగా…!

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ స్థానిక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉప‌ ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ? తెలియదు కానీ ప్రధాన పార్టీలు మాత్రం అప్పుడే గెలుపు వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉండటం ఖరారైంది. ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేందుకు 40 రోజుల పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈట‌ల‌ను ఓడించాలని క‌సితో ఉన్న టిఆర్ఎస్ ఇప్పటికీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. టిఆర్ఎస్ తరఫున అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాలేదు కాని.. ఈట‌ల‌ను ఢీ కొట్టేందుకు అభ్యర్థి కోసం వరుసపెట్టి సర్వేలు జరుగుతున్నాయి.

అయితే ఇప్పుడు హుజూరాబాద్ రాజ‌కీయం మారుతోన్న ప‌రిస్థితి. కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎవ‌రనేది ప్ర‌క‌టించ‌లేదు. రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు అయ్యాక జ‌రుగుతోన్న తొలి ఎన్నిక కావ‌డంతో ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. గ‌తంలో ఈట‌ల రాజేంద‌ర్‌పై రెండు సార్లు పోటీ చేసి ఓడిన పాడి కౌశిక్‌రెడ్డినే ఈ ఉప ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేయొచ్చ‌న్న‌ ఊహాగానాలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి స‌మీప బంధువు. అయితే ఇప్పుడు రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు కావ‌డంతో హుజూర్ న‌గ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎవ‌రు ? అవుతారు అన్న చ‌ర్చ ఉండగానే ఇప్పుడు కౌశిక్ ఏకంగా పార్టీ మారిపోతార‌నే అంటున్నారు.

ఇటీవ‌ల కౌశిక్ ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్‌తో స‌మావేశ‌మ‌వ్వ‌డంపై పార్టీ వ‌ర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఇక కౌశిక్ ముందు నుంచి ఈట‌ల‌కు బ‌ల‌మైన వ్య‌తిరేకిగా ముద్ర ప‌డ్డారు. ఇక రేవంత్‌కు ప‌దవి రాక‌ముందు వ‌ర‌కు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి తానే పోటీ చేస్తాన‌ని చెప్పుకున్న కౌశిక్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇక కౌశిక్ కాంగ్రెస్‌లో ఉన్నా.. ఒక‌వేళ టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేసినా ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి పార్టీ మారేందుకు రెడీ అయిపోతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో రెండు మూడు రోజుల్లో ఆయ‌న మంత్రి హ‌రీష్‌రావుతో భేటీ అవుతార‌ని అంటున్నారు. అయితే కౌశిక్ పార్టీ మారినా టీఆర్ఎస్ అభ్య‌ర్థి అవుతార‌న్న గ్యారెంటీ అయితే లేదు.