నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌.. మ‌ళ్లీ లైన్లోకొచ్చారు

గ‌త నెలలో జ‌ర‌గాల్సిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక ఎన్నిక‌ల్ని కరోనా కార‌ణంగా వాయిదా వేస్తూ సంచ‌లన నిర్ణ‌యం తీసుకుని చ‌ర్చ‌నీయాంశం అయ్యారు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌. ఆ నిర్ణ‌యంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హా వైకాపా పెద్ద‌లు ఎలా మండిప‌డ్డారో.. ఈసీపై ఎంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారో తెలిసిందే. వాళ్ల విమ‌ర్శ‌లు, బెదిరింపుల త‌ర్వాత త‌న‌కు భ‌ద్ర‌త అవ‌స‌ర‌మంటూ కేంద్రానికి లేఖ రాయ‌డంతో ర‌మేష్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. ఆ త‌ర్వాత అంద‌రూ క‌రోనా చ‌ర్చ‌ల్లో మునిగిపోవ‌డంతో ర‌మేష్ పేరు ఎక్క‌డా పెద్ద‌గా వినిపించ‌లేదు. ఐతే కొంత విరామం త‌ర్వాత ఈసీసీ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఏపీ అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల అభ్య‌ర్థులు.. క‌రోనా సాయం కింద ఇస్తున్న వెయ్యి రూపాయ‌లు అంద‌జేస్తూ త‌మ‌కే ఓటు వేయాల‌ని ప్ర‌చారం చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీనిపై ఈసీకి ఫిర్యాదులు అంద‌డంతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ స్పందించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. కానీ ప్రస్తుత సంధికాలంలో ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని రమేష్‌ ‌కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం..ఓటర్లను ప్రభావితం తదితర చర్యలు చేయకూడద‌ని.. అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టిసారించాలని.. నిజానిజాలను విచారించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు ఆయన లేఖ రాశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి  తమ స్వప్రయోజనాల కోసం ప్రజల మద్దతు కోరుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని రమేశ్‌కుమార్‌ చెప్పారు. క‌రోనా సాయం కింద నగదు పంపిణీ చేసే సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు భాజపా, సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ ఇలా స్పందించారు.