సస్పెండైన అనస్తీషియా డాక్టరు సుధాక్ అరెస్టు వివాదం ఏపీ ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పడేసినట్లే కనిపిస్తోంది. దీనిపై ఈరోజు రెండు కీలక పరిణామాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుధాకర్ వ్యవహారంపై లేఖ రావడం ఒక సంఘటన కాగా, హైకోర్టు సుధాకర్ విషయంలో తనదైన శైలిలో స్పందించడం రెండో ఘటన.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆ నివేదికను ముఖ్యమంత్రి జగన్ కి పంపింది. దీంతో పాటు సుధాకర్ పై పోలీసుల అనుచిత ప్రవర్తనపై కూడా ఐఎంఏ అసహనం వ్యక్తంచేసింది. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషంగా ఉందని, ఇది డాక్టరు వృత్తిలో ఉన్న వారిలో ఆందోళన కలిగించే విధంగా ఉందని లేఖలో పేర్కొంది. ఒక వైద్యుడి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దేశ వ్యాప్తంగా డాక్టర్లలో మనోవేదనకు గురిచేసేలా ఉందని లేఖలో పేర్కొంది. అదే సమయంలో సుధాకర్ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పు పట్టింది. వైద్యుడిగా సుధాకర్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొంది.
మరోవైపు ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఈ వ్యవహారంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు డాక్టర్ సుధాకర్‌ను బుధవారం (ఈనెల 20వ తేదీ) తమ ముందు హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది. డాక్టర్‌ను కలుసుకునేందుకు తల్లికి అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలపై కూడా సమాధానం చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను కోరుతూ జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates