వైసీపీ నేత‌లూ.. జాగ్ర‌త్త‌.. జ‌గ‌న్ అన్నీ గ‌మ‌నిస్తున్నారు..!


రాజ‌కీయాల్లో నేత‌లంద‌రూ ఒకే విధంగా ఉండ‌రు. ఎవ‌రి దూకుడు వారిది. ఎవ‌రి వ్యూహాలు వారివి. నియోజ‌క వ‌ర్గాల్లో పైచేయిసాధించాల‌ని ప్ర‌తి ఒక్క నేతా ప్ర‌య‌త్నిస్తారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ కోసం ఏదో ఒక సంచ‌ల‌నాల‌కు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇది అధికారంలో ఉన్న ఏ పార్టీలో అయినా స‌ర్వ‌సాధార‌ణ‌మే. అయితే.. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ దూకుడు, సంచ‌ల‌నాలు మ‌రీ ఎక్కువ‌గా ఉన్నాయి. నిజానికి ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు వివిధ సంక్షేమ కార్య‌క్రమాల‌ను లేదా ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

గ‌తంలో టీడీపీ స‌ర్కారు ఉన్న‌ప్పుడు నేత‌లు ఇదే పంథా ఎంచుకున్నారు. ఒక‌రిద్ద‌రు వేరే వేరే మార్గాలు ఎంచుకున్నా.. చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిచేస్తూ వ‌చ్చారు. వారిని హెచ్చరించారు. అయితే.. ఇప్పుడు వైసీపీలో మాత్రం నేత‌లు ఏం చేసినా ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ కూడా ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేదు అనే టాక్ వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల‌పై కొంద‌రు వైసీపీ నేత‌లు దాడులు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నా.. సీఎం స్థాయిలో ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇవ‌న్నీ.. కామ‌న్ అనుకుంటున్నార‌నే ప్ర‌చారం ఉంది.

అయితే.. ఈ త‌ర‌హా ప్ర‌చారం నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఎం జ‌గ‌న్ పార్టీలో జ‌రుగుతున్న అన్ని కార్య‌క్ర‌మాల‌ను, నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును.. నిశితంగానే గ‌మ‌నిస్తున్నార‌ని.. నివేదిక‌లు కూడా అత్యంత గోప్యంగా తెప్పించుకుంటున్నార‌ని అంటున్నారు. ఇక సొంత పార్టీలో ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను తొక్కేస్తోన్న ఎమ్మెల్యేలు, నేతల విష‌యంలో కూడా జ‌గ‌న్ ఓ కంట క‌నిపెడుతూనే ఉన్నట్టు టాక్ ? ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప‌ద‌వుల్లో సైతం ఎమ్మెల్యేల మాట‌కు విలువ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పార్టీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే పైకి ఏమీ అన‌క‌పోయినా.. ఎక్క‌డ చ‌ర్య‌లు తీసుకోవాలో.. అక్క‌డ సైలెంట్‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని.. ఎవ‌రు ప‌నిచేస్తున్నారు? ఎవ‌రు పార్టీని వాడుకుంటున్నారు? అనే విష‌యాల‌పై జ‌గ‌న్‌కు స్ప‌ష్ట‌త ఉంద‌ని.. చెబుతున్నారు. సో.. క‌ష్ట‌ప‌డుతున్న‌వారికి ప‌ద‌వులు ఇస్తున్న తీరును గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ ఏత‌ర‌హాలో పార్టీపై దృష్టి పెట్టారో.. అర్ధ‌మ‌వుతుంద‌ని..చెబుతున్నారు. మ‌రి దూకుడు నేత‌లు ఇప్ప‌టికైనా .. త‌మ ప‌ద్ధ‌తిమార్చుకుంటారో లేదో చూడాలి.