తరచి చూస్తే.. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత.. ఏదైనా భావోద్వేగ అంశాన్ని గులాబీ బాస్ కేసీఆర్ టేకప్ చేస్తే.. దాని ప్రయోజనాన్ని సొంతం చేసుకునే వరకూ వదిలిపెట్టేవారు కాదు. మరెవరూ ఆయన దరిదాపుల్లోకి వచ్చే వారు కాదు. అలాంటి సారుకు తొలిసారి కమలనాథుల కారణంగా షాక్ తగిలిందా?అంటే అవుననే చెప్పాలి.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా సీమకు తరలించేలా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై తెలంగాణకు చెందిన అధికార.. విపక్ష పార్టీలు ఏకమై ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మొదట్నించి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అన్నంతనే తెలంగాణ నేతలు మాత్రమే కాదు.. ప్రజలు సైతం తీవ్రంగా స్పందిస్తుంటారు. తమకు అన్యాయం జరిగిందన్న వాదనను వినిపిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు తమ ఉసురు తీసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.
అదే సమయంలో ఈ ప్రాజెక్టుకారణంగా వేలాది ఎకరాలు కర్నూలు జిల్లా నష్టపోయింది.. ఇప్పటివరకూ పరిహారం అందలేదన్న కర్నూలు జిల్లా ప్రజల గోడును మాత్రం పరిగణలోకి తీసుకోరు. ఉమ్మడి పాలనలో తెలంగాణకు నష్టం జరిగిందనే వారు.. రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించరు.
ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. తాజాగా తెరపైకి వచ్చిన ఎత్తిపోతల పథకం కారణంగా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న మాట ముఖ్యమంత్రి కేసీఆర్ నోట రావటమే కాదు.. ఈ అంశంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటివేళలో అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ఎత్తిపోతల పథకంపై తాము మాత్రమే పోరాటం చేయగలమన్న సంకేతాన్ని ప్రజలకు మరింత అర్థమయ్యేలా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు.
అయితే.. ఆయనకు ఆ అవకాశాన్నిఇవ్వకుండా తెలంగాణ బీజేపీ నేతలు వేసిన ఎత్తులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎమోషనల్ అస్త్రశస్త్రాల్ని సారు సిద్ధం చేసుకుంటున్న వేళకే.. ఏపీ చేపట్టే ప్రాజెక్టును నిలిపివేయాలన్న సందేశాన్ని కేంద్రం నుంచి నేరుగా ఏపీకి వెళ్లేలా చేయటంతో కమలనాథులు సక్సెస్ అయ్యారు.
దీంతో.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి ఊహించని షాక్ తగిలినట్లైంది. ఎప్పుడైనా మొదటి పంచ్ తమదే అన్నట్లుగా ఉండే గులాబీ దండుకు.. తాజా పరిణామం మింగుడపడనిదిగా మారింది. ఇప్పటివరకూ సారు ఎత్తులకు అందరూ చిత్తు అయ్యే పరిస్థితి నుంచి తొలిసారి బండి కదిపిన పావులకు కేసీఆర్ ఆత్మరక్షణలో పడటం హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates