మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. దాదాపు టీఆర్ఎస్ తో ఆయనకు 19ఏళ్ల అనుబంధం. ఆ అనుబంధానికి ఈ రోజుతో తిలోదకాలు పలికారు. కాగా.. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది.
అయితే ఏనాడు ఆయన ఈ విషయంపై స్పందించింది లేదు. కాగా.. తాజాగా.. తాను బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. వారం రోజుల్లో ఢిల్లీలో బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు.
తనది కమ్యూనిస్టు డీఎన్ఏ అయినప్పటికీ… ప్రజల ఒత్తిడి మేరకే బీజేపీలోకి వెళ్తున్నానని, కమ్యూనిస్టులంతా కేసీఆర్ మార్గనిర్దేశంలో పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వ్యవస్థతో ఒక వ్యక్తి పోటీ పడగలడా…? అందుకే నా పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
అయితే, బీజేపీతో టీఆర్ఎస్ సంబంధాలు… భవిష్యత్ పొత్తులు అవసరం అయితే తమలాంటి నాయకుల పరిస్థితి ఏంటీ అన్న విషయాలపై పార్టీ పెద్దలతో చర్చించానని ఈటల తెలిపారు. హుజురాబాద్ లో తన వర్గం వారిని లోబరుచుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే 50కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలను నమ్ముకున్న బిడ్డగా వారి ముందుకే వెళ్తున్నానని, ఎన్నో కఠిన సమయాల్లో అండగా నిలిచిన వారు ఇప్పుడు కూడా తన వైపు ఉంటారని నమ్మకం వ్యక్తం చేశారు.