కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారిలో కొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా తో చనిపోతున్న వారిలో ఆక్సిజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. దాంతో రోగుల్లో అత్యధికులు ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు + ఆక్సిజన్ దొరక్క అవస్థలు పడుతున్న రోగులు చివరకు అంబులెన్సులోనే అడ్జస్టు అవుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
ఇలాంటి నేపధ్యంలోనే ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ తరపున రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ట్రస్టు డిసైడ్ చేసింది. అయితే ట్రస్టు ఏర్పాటు చేయబోయే ఆక్సిజన్ ప్లాంట్లు తమ పార్టీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేయబోతున్నారట. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, గుంటూరు జిల్లాలోని రేపల్లె, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్లాంట్ల ఏర్పాటు జరుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలోని రోగులందరికీ అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావటంలేదు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎప్పటినుండో మూతపడున్న ఫ్యాక్టరీల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం తెరిపిస్తున్నది. అలాగే విశాఖపట్నంలోని స్టీల్ ఫ్యాక్టరీ నుండి 100 టన్నుల ఆక్సిజన్ అందుతున్నది.
ఇదికాకుండా అనేక జిల్లాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్లను ఎన్ని ఏర్పాటు చేస్తున్నా పెరిగిపోతున్న డిమాండ్ కు తగ్గట్లు ఆక్సిజన్ ఉత్పత్తి అవటంలేదన్నది వాస్తవం. ఇలాంటి నేపధ్యంలోనే ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నాలుగు ప్లాంట్లు, సోనూసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు, నెల్లూరులో రెండు ప్లాంట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి (సీఎస్ఆర్) పద్దతిలో మరిన్ని కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తే మంచిదేగా.