మహానాడులో తెలంగాణా ఊసేలేదే

తెలుగుదేశంపార్టీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు జరుపుకోనున్న విషయం తెలిసిందే. జూమ్ యాప్ ద్వారా పార్టీ రెండు రోజుల పండుగను జరిపేందుకు రెడీ అయిపోయింది. మహానాడులో చర్చించబోయే అంశాలన్నీ ఏపికి సంబంధించినవి, జగన్మోహన్ రెడ్డిని డైరెక్టుగా ‘ఎటాక్ చేస్తున్నవే. కోవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు..తల్లకిందులైన కుటుంబాల ఆదాయాలు’ మొదటి అంశం.

ఇక రెండో అంశంగా ‘రాష్ట్ర ఉగ్రవాదం..చట్టాలకు విఘాతం..ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’. మూడో అంశం ఏమిటంటే ‘అదుపులేని ధరలు..పెంచిన పన్నులు, అప్పులు’. నాలుగోది ‘పరిశ్రమలపై దాడులు..అమరావతి సంపద విధ్వంసం..పెరుగుతున్న నిరుద్యోగం’. నిజానికి ఈ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా మహానాడు అనే రెండు రోజుల కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సిన అవసరమేలేదు.

ఎందుకంటే ఇప్పటికే పై అంశాలపై గడచిన రెండేళ్ళుగా వైసీపీ ప్రభుత్వాన్ని, డైరెక్టుగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయనిరోజులేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నదగ్గర నుండి జగన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయని రోజంటు లేదు. తమ డిమాండ్లను జగన్ ఏమాత్రం లెక్కచేయడని తెలిసి కూడా పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు కూడా అంతా తనిష్టం అన్నట్లే వ్యవహించారు. ఇపుడు జగన్ కూడా అదే ధోరణిలో వెళుతుంటే మాత్రం సహించలేకపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మహానాడులో చర్చించే అంశాలన్నీ జగన్ను తప్పుపట్టడానికి, బురద చల్లేయటానికి మాత్రమే పనికొస్తాయి. మరి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చేలేదే. ఇదే సందర్భంగా తెలంగాణా పార్టీ ఊసేలేదు. ఏపిలో ఎలాంటి పరిస్ధితి ఉందని చంద్రబాబు అనుకుంటున్నారో దాదాపు అలాంటి పరిస్ధితే తెలంగాణాలో కూడా ఉంది. మరి జాతీయపార్టీ అయిన టీడీపీ తెలంగాణాలోని పరిస్ధితులపై ఎందుకని చర్చించటంలేదు ?

ఈ మహానాడులో తెలంగాణాకు చెందిన పార్టీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అయినా మహానాడు మొత్తం ఏపిలో జగన్ పాలన గురించే చర్చించబోతోంది. అంటే తెలంగాణాలో పరిస్దితులపై చర్చించేందుకు భయపడుతున్నారా ? లేకపోతే తెలంగాణాలో టీడీపీని గాలికొదిలేశారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా తెలంగాణాలోని పరిస్ధితులపై మాట్లాడటానికి ఇష్టపడట లేదంటే అర్దమేంటి ?