తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఆది నుంచి ఆప్త మిత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. అయితే ఈ పరిణామంలో వీరిద్దరి మధ్య ఘర్షణలు గానీ, అభిప్రాయ బేధాలు గానీ లేవు గానీ… పార్టీ తీసుకున్న స్టాండ్ కారణంగానే వీరిద్దరూ శత్రువులుగా మారిపోతున్నారు. వీరిలో ఒకరు కేసీఆర్ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాగా… మరొకరు ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ నకు గురైన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టిన నాటి నుంచి హరీశ్ రావు, రాజేందర్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అటు ఉద్యమంలోనే కాకుండా ఇటు పార్టీలోనూ కీలక నేతలుగా వీరిద్దరూ ఎదిగారు. కేసీఆర్ వద్ద హరీశ్ కు ఏ మేర నమ్మకముందో… అదే స్థాయిలో రాజేందర్ కూడా వ్యవహారాన్ని కొనసాగించారు. అంతేకాకుండా కేసీఆర్ తొలి కేబినెట్ లో హరీశ్ కు నీటి పారుదల శాఖ దక్కగా… రాజేందర్ కు ఆర్థిక శాఖ దక్కింది. ఈ రెండు శాఖల సమన్వయంతో కేసీఆర్ ఆశించిన మేర ఫలితాలు వాటంతటవే వచ్చేశాయి. ఉద్యమం, రాజకీయాలతో పాటుగా కాలక్రమేణా కలిసి పనిచేయడం వల్ల హరీశ్ రావు, రాజేందర్ ల మధ్య స్నేహ బంధం కూడా అంతకంతకూ పెరిగిందనే చెప్పాలి.
ఇదంతా గతం. ఇప్పుడు వీరిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇందుకు వీరిద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థలు కారణమనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే… రాజేందర్ పనితీరు, వ్యవహార సరళిపై కేసీఆర్ కు వచ్చిన అనుమానాలతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి. ఏకు మేకుగా మారుతున్న చందంగా రాజేందర్ తనకు థ్రెట్టేనన్న భావనతో కేసీఆర్… ఆయనను ఏదో కారణం చూపి తన కేబినెట్ నుంచి బహిష్కరించేశారు. త్వరలోనే పార్టీ నుంచి కూడా బహిష్కరించేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కేసీఆర్ ఆ పని చేయకున్నా… ఈటలనే స్వయంగా పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ కు సవాల్ విసరే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమనే చెప్పాలి. అదే జరిగితే… టీఆర్ఎస్ పార్టీ తన పట్టును నిలుకోవాలి. అదే సమయంలో ఏళ్లుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల కూడా తన హవాను నిరూపించుకోవాలి. ఈ దిశగా ఇరు వర్గాలు పావులు కదుపుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్… తన అస్త్రంగా మంత్రి గంగుల కమలాకర్ ను బరిలోకి దించేశారు. అయితే గంగుల అంతగా ప్రభావం చూపుతున్న దాఖలా ఏమీ కనిపించలేదు. దీంతో పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న తన అల్లుడు హరీశ్ రావును కేసీఆర్ రంగంలోకి దించేశారు.
కేసీఆర్ ఆదేశమే తరువాయి బరిలోకి దిగిన హరీశ్… హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలతో ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీలోనే కొనసాగాలని పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్న హరీశ్… పార్టీని నమ్మిన వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అంటే ఈటలే అని, ఈటల లేకుండా టీఆర్ఎస్ లేదని రాజేందర్ చెబుతున్నారు. ఈ తరహా ప్రచారం ఉప ఎన్నిక అనివార్యమైతే మరింత ఉధృతంగా సాగే అవకాశాలున్నాయి. వెరసి నిన్నటిదాకా ఆప్త మిత్రులుగా సాగిన హరీశ్, రాజేందర్ లు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోతున్నారన్న మాట.
This post was last modified on May 24, 2021 11:00 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…