వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరేనా ? ఆమె ఎప్పటి నుంచో కలలు పెట్టుకున్న మంత్రి పదవి వస్తుందా ? రాదా ? అన్నది సస్పెన్స్‌గా ఉంది. టీడీపీలో రెండు సార్లు ఓడిన రోజా వైసీపీలో నగరి నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రోజా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార టీడీపీ వాళ్ల నుంచి అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు. రోజాను అసెంబ్లీలో అప్పటి అధికార టీడీపీ నేతలు ఎంతో టార్గెట్ చేశారు. ఆమెను అసెంబ్లీ నుంచి యేడాది పాటు సస్పెండ్ చేస్తే చివరకు ఆమె సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
రెండోసారి నగరిలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాగ్దాటి వినిపించినందుకు తాను పడిన కష్టానికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే అనుకున్నారు. అయితే అదే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ బలమైన నేత పదే పదే రోజా దూకుడుకు బ్రేకులు వేస్తోన్నారన్న చర్చలు అధికార వైసీపీ వర్గాల్లోనే ఉన్నాయి. చివరకు ఆమె జగన్ ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే రోజా ఈ పదవితో సంతృప్తిగా లేరన్నది మాత్రం వాస్తవం. ఇంకా చెప్పాలంటే వైసీపీలోనే కాకుండా ఇటు టీడీపీలోనూ రోజా స్థాయిలో బలమైన వాయిస్ వినిపించి.. నేతలను టార్గెట్ చేసే మహిళా నాయకురాల్లు లేరనే చెప్పాలి. ఈ విషయంలో రోజాకు రోజానే సాటి.
అలాంటి రోజా మరో నాలుగు నెలల్లో జరిగే మంత్రివర్గ మార్పుల్లో ఈ సారి ఛాన్స్ వదులకోకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఆమె తన స్థాయిలో లాబీయింగ్ స్టార్ట్ చేసేసినట్టు వినికిడి. ముఖ్యంగా జగన్‌కు సన్నిహితంగా ఉండే ఇద్దరు సలహాదారులను ఆమె ఇప్పటికే కలిసి తన మంత్రి పదవి కోరికను వారికి చెప్పినట్టు తెలుస్తోంది. రోజా ఎంత ట్రై చేస్తున్నా జగన్ దగ్గర చక్రం తిప్పే ఓ మంత్రి ఆమె పదవికి ఈ సారి కూడా అడ్డం పడతారనే ప్రచారం జరుగుతోంది. సదరు మంత్రిని కేబినెట్ నుంచి తప్పించే ఛాన్స్ లేదు. దీంతో మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి రేసులో ముందు ఉన్నా.. జిల్లా ఈక్వేషన్లు, సామాజిక సమీకరణలు ఆమెకు మైనస్ అవుతాయనే అంటున్నారు. మరి రోజా ఈ సారి పంతంలో ఎంత వరకు నెగ్గుతుందో ? చూడాలి.