ఏపీకి కొత్త ముప్పు ‘యాంపిన్’ ?

ఈ మధ్యన ఏపీ టైం ఏ మాత్రం బాగున్నట్లుగా లేదు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సమస్యలతో ఏపీ ప్రజలు మాత్రమే కాదు ప్రభుత్వం సైతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచాన్ని చుట్టేసిన మాయదారి రోగానికి ఏపీ ఏమీ మినహాయింపు కాదు.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే.. ఏపీ పరిస్థితి బాగోలేదనే చెప్పాలి. ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా పని చేస్తున్నా.. ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఇదిలా ఉండగానే.. విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ ఉదంతం షాకింగ్ గా మారింది.

ఓపక్క దయనీయమైన ఆర్థిక పరిస్థితిలోనూ పాలనా రథాన్ని నడుపుతున్న జగన్ సర్కారుకు.. మాయదారి రోగంతో వచ్చి పడిన పరిణామాలతో మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇది సరిపోదన్నట్లుగా ఆయా జిల్లాల్లో చోటు చేసుకుంటున్న ప్రమదాలు ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కోవకే వస్తుంది. ఈ సమస్యలన్ని సరిపోవన్నట్లుగా తాజాగా తుపాను రూపంలో మరో సవాలు ఏపీ ప్రజల ముందుకు వచ్చింది.

ఆగ్నేయ బంగాళాఖాతం.. దానికి అనుకొని ఉండే దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. రానున్న రెండు రోజుల్లో తుపానుగా మారనుంది. దీనికి ‘యాంపిన్’ అనే పేరు పెట్టేశారు. ఈ నెల 16 కానీ 17 ఉదయానికి తుఫానుగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

తొలుత వాయువ్యంగా.. తర్వాత ఉత్తర ఈశాన్యంగా ప్రయాణించే క్రమంలో ఈ తుఫాను తీవ్రత పెరుగుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావం కోస్తా మీద ఉంటుందని చెబుతున్నారు. ఉరుములు.. మెరుపులతో పాటు.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తప్పవంటున్నారు. ఈ విపత్తు ఏపీ ముందు మరెన్ని సవాళ్లు విసురుతుందో చూడాలి.