పరిస్దితులు బాగాలేనపుడు తాడే పామై కరుస్తుందనేది నానుడి. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఇపుడీ నానుడే నిజమవుతుందా ? అనే చర్చ జోరుగా మొదలైంది. ఎలాగంటే వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఇపుడిదే చర్చ జరుగుతోంది. జగన్ బెయిల్ ను రద్దుచేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలంటు వేసిన పిటీషన్ పై వచ్చే వారంనుండి విచారణ ప్రారంభించటానికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.
జగన్ బెయిల్ రద్దు చేసి యాక్షన్ తీసుకోవాలంటు ఈమధ్య తిరుగుబాటు ఎంపి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ వేశారు. దానిపై వాదోపవాదనలు విన్న కోర్టు చివరకు ఎంపి కేసుకు అన్నీ విధాలుగా విచారణార్హత ఉందని తేల్చారు. అందుకనే తిరుగుబాటు ఎంపి వేసిన కేసును విచారణకు అడ్మిట్ చేసుకుని జగన్ కు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో, అరబిందోలకు సంబందించిన భూకేటాయింపులపై సీబీఐ నమోదుచేసిన కేసులో జగన్ బెయిల్ రద్దుచేయాలని ఎంపి తన పిటీషన్లో కోరారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాక్ష్యులను బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపించారు. తన సహనిందుతులకు కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నట్లు చెప్పటమే కీలకం.
సరే ఇఫుడు ఎంపి వేసిన కేసు వల్ల జగన్ కు వచ్చే సమస్య ఏమీ లేదని వైసీపీ వర్గాలు సర్దిచెప్పుకుంటున్నాయి. కాని ఏం జరుగుతుందో అన్న ఆందోళన మాత్రం అందరిలో ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విచారణలో అన్నీ విధాలుగా సహకరిస్తానని కోర్టుకు చెప్పిన జగన్ ఇపుడు విచారణకు గైర్హాజరవుతున్నట్లు చెప్పారు. తన కార్యక్రమాలను కోర్టు వాయిదా తేదీలకు అనుగుణంగా రూపొందించుకుని జగన్ వాయిదాలకు రావడం లేదన్న విషయాన్ని కూడా రఘురామ తరఫు లాయర్లు వాదించారు.
మొత్తానికి ఇప్పటికైతే తిరుగుబాటు ఎంపి పార్టీకి, జగన్ కు తలనొప్పిగానే తయారయ్యారు. మరి ఈ వ్యవహరాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాల్సిందే.