ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయనకు అత్యంత సన్నిహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 నాయకుడు విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలంటూ ఈ మధ్య గట్టి ప్రచారమే నడుస్తోంది. పైగా రెండు రోజుల కిందట విశాఖ పర్యటనకు బయల్దేరుతూ జగన్ తన కారు నుంచి విజయసాయిని దించేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఆళ్ల నాని ఆరోగ్య మంత్రి కావడమే దానికి ప్రధాన కారణం. కానీ విజయసాయి సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారని.. అది జగన్‌కు నచ్చట్లేదని.. అందుకే ప్రాధాన్యం తగ్గించేస్తున్నారని.. మరోవైపు జగన్‌కు వ్యతిరేకంగా సాయిరెడ్డి కుట్ర చేస్తున్నారని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. కాస్త తర్కంతో ఆలోచిస్తే వాళ్లిద్దరి మధ్య విభేదాలన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనని స్పష్టం అయిపోతుంది.
జగన్, విజయసాయిరెడ్డిలది రెండు దశాబ్దాల అనుబంధం. జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్న రోజుల నుంచి వైఎస్ కుటుంబానికి విజయసాయి సన్నిహితుడు, వారికి సీఏగా వ్యవహరించారు. జగన్ ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పట్నుంచో సాయం అందిస్తూ ఉన్నారు. తర్వాత రాజకీయంగా కూడా జగన్‌కు తోడ్పాటు అందిస్తూ వస్తున్నాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ విజయంలో ఆయన పాత్ర కూడా ఎంతో ఉంది. జగన్ అత్యంత నమ్మే వ్యక్తుల్లో సాయిరెడ్డి ఒకరు. కాబట్టి జగన్‌కు ఆయన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో జస్ట్ చార్టెడ్ అకౌంటెంట్‌గా మిగిలిపోకుండా ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీలో నంబర్ 2 నాయకుడిగా విజయసాయి ఉన్నాడన్నా.. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడన్నా.. ఏపీలో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నాడన్నా.. అది జగన్ చలవే. కాబట్టి ఆయనకూ జగన్ అవసరం ఎంతో ఉంది. జగన్ లేకుంటే లేదా జగన్‌కు దూరమైతే సాయిరెడ్డికి విలువ ఉండదు. కాబట్టి జగన్, విజయసాయిల బంధం ఉభయతారకం అని చెప్పొచ్చు.
కలిసి సాగడం వల్లే వీళ్లిద్దరూ అత్యుత్తమ ప్రయోజనం పొందుతారు. ఎవరిని ఎవరు దూరం చేసుకున్నా మంచిది కాదు. గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాలను పటాపంచలు చేయడంలో విజయసాయిరెడ్డి సఫలం అయ్యాడని చెబుతారు. ఒకానొక దశలో చంద్రబాబు జగన్ ని కాకుండా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆయువు పట్టుమీద కొట్టడమే కాదు, కేంద్ర బీజేపీతో జగన్ సానుకూల సంబంధాలు ఏర్పడటంలో కూడా విజయసాయిరెడ్డి కృషి ఉంది.
ఒక్క బీజేపీతోనే కాదు, జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో సత్సంబంధాలు నెరపడంలో వైసీపీకి సాయిరెడ్డి పెద్ద అండ అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలో ఎటువంటి చికాకులు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకు నడవడానికి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను పార్లమెంటరీ విభాగాన్ని విజయవంతంగా నడపడంలో సాయిరెడ్డి కృషి ఎంతో ఉంది.
పార్టీలో ఇంతకీలకంగా ఉన్నపుడు వీరి మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి. ఇద్దరి మధ్య ఎంతో సఖ్యత, అవగాహన ఉందని.. పూర్తి సమన్వయంతోనే సాగుతున్నారని వారి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా చెబుతారు. వీరి మధ్య విభేదాలన్నది ప్రత్యర్థులు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారం కావచ్చు. కాబట్టి సోషల్ మీడియా జనాలు ఏదో ఊహించుకుని వీరి మధ్య విభేదాల గురించి చర్చించడం కాలయాపన చర్చ మినహా మరేం కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates