తెలుగోడికి అత్యున్నత స్థానం దక్కింది. దేశ చరిత్రలో రెండోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుర్చీలో ఒక తెలుగువాడు కూర్చోనున్నారు. ఈ ఘనతను సొంతం చేసుకున్నది జస్టిస్ ఎన్వీ రమణ. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించటం.. రాష్ట్రపతికి పంపటం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి కోవింద్ ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశారు. తాజాగా.. దీనికి సంబధించిన అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి.
అంతకు ముందు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు తెలుగు వారికి ఈ అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం రాలేదు. జస్టిస్ ఎన్వీ రమణ కారణంగా ఈ పదవిని చేపట్టే రెండో తెలుగు వారు కానున్నారు.
క్రిష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న జన్మించారు. గణపతిరావు.. సరోజినిలు ఆయన తల్లిదండ్రులు. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి అమరావతిలోని ఆర్ వీవీఎన్ కాలేజీలో బీఎస్సీలో డిగ్రీ పూర్తి చేశారు. 1982లో నాగార్జున వర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా ఎన్ రోల్ చేసుకున్నారు. అనంతరం లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు.
సివిల్.. క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లోనూ రమణకు మాంచి పట్టు ఉంది. ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపైనా లాయర్ గా ఆయన పలు ట్రైబ్యునళ్లలో వాదనలు వినిపించారు. రైల్వేతో పాటు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఏపీ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
2000 జూన్ 27న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. 2013లో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన ఆయన..తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాల్ని సుమోటోగా పిటీషన్లను విచారణకు స్వీకరించి అప్పటి ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
దక్షిణ ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఇరవైఏళ్ల విద్యార్థి నిడో తానియాను షాపువాళ్లు కొట్టి చంపినట్లుగా వార్త పత్రికల్లో వస్తే సుమోటోగా తీసుకొని విచారించారు. అదనపు కోర్టులు ఏర్పాటు ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు తెలుగు మీద మమకారం ఎక్కువ. రాష్ట్రంలో న్యాయవ్యవస్థలో తెలుగు అమలు చేయటానికి చాలా ప్రయత్నం చేశారు.
ఈ నెల 23న ప్రస్తుతం సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు. దీంతో.. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనీ పదవిలో 2022 ఆగస్టు 26 వరకు ఉండనున్నారు. ఏమైనా ఒక తెలుగువాడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావటం తెలుగువారంతా సంతోషానికి గురి కావాల్సిన ప్రత్యేక పరిస్థితిగా చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates