రీ నామినేషన్లకు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కల్పించిన అవకాశాన్ని టీడీపీ ఒకచోట బహిష్కరించింది. అప్పట్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసే సమయంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఒక్క చంద్రబాబు మాత్రమే కాకుండా ప్రతిపక్షాలన్నీ ఇలాంటి ఆరోపణలనే గుప్పించారు.
ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ అన్నింటినీ పరిశీలించారు. కలెక్టర్ల దగ్గర నుండి నివేదికలు తెప్పించుకున్నారు. ఆ నివేదికల ఆధారంగా మూడు మున్సిపాలిటిలు, ఒక నగర పంచాయితిలో 14 వార్డుల్లో రీ-నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మూడు మున్సిపాలిటీల్లో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటి కూడా ఉంది. పుంగనూరు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.
పుంగనూరు మున్సిపాలిటిలో 31 వార్డులున్నాయి. వీటిల్లో 9, 14, 28 వార్డులకు రీ నామినేషన్ అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని టీడీపీ బహిష్కరించింది. ఇదే విషయమై నియోజకవర్గం ఇన్చార్జి అనీషారెడ్డి మాట్లాడుతూ మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని తాము కమీషన్ ను కోరినట్లు చెప్పారు. అయితే టీడీపీ ఫిర్యాదును నిమ్మగడ్డ పట్టించుకోకుండా కేవలం మూడు వార్డుల్లో మాత్రమే రీ నామినేషన్ కు అవకాశం ఇవ్వటాన్ని తప్పుపట్టారు.
ముగ్గురితో రీ నామినేషన్లు వేయించి వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టడం తమకు ఇష్టం లేదన్నారు. ఇస్తే మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని లేకపోతే తమకు ఆ అవకాశమే అవసరం లేదన్నారు. అందుకనే రీ నామినేషన్లను బహిష్కరించినట్లు అనూషారెడ్డి చెప్పారు. అయితే తిరుపతి మున్సిపాలిటిలో మూడు డవిజన్లలో టీడీపీ రీ నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నది. మరి మిగిలిన మున్సిపాలిటిల్లో ఏమి చేశారనే విషయమై క్లారిటి రావాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates