ఇలా అయితే.. బెజ‌వాడ టీడీపీకి బీట‌లే!

టీడీపీకి అంతో ఇంతో బలం ఉన్న న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న బెజవాడ‌.. త‌ర్వాత కాలంలో టీడీపీకి ప్ర‌ధాన కేంద్రంగా మారింది. కొన్నాళ్లు .. కాంగ్రెస్ నాయ‌కులు చ‌క్రం తిప్పి నా.. ప్ర‌ధానంగా దేవినేని నెహ్రూ హ‌యాంలో టీడీపీ పుంజుకుంది. ఫ‌లితంగా న‌గ‌రంలోని కొండ‌ప్రాంతాలు.. శివారు ప్రాంతాల్లోనూ టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా ఉంది. ఇక‌, న‌గ‌రంలోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గం… ఎక్కువ‌గా ఉండ‌డంతో వారంతా టీడీపీకి బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్నారు. న‌గ‌రంలో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. ఒక‌టి త‌ప్ప‌.. రెండు నియోజ‌క‌వర్గాల్లో టీడీపీ ఎంత బ‌లంగా ఉందనేది .. గ‌త ఎన్నిక‌ల్లోనే తెలిసింది.

వైసీపీ సునామీ జోరు ఉన్న‌ప్ప‌టికీ.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ద్దె రామ్మోహ‌న్ విజ‌యం సాధించారు. ఇక‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా… గ‌ట్టి పోటీ ఇచ్చారు. కేవ‌లం పాతికి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ప‌శ్చిమ‌లో మాత్ర‌మే.. పార్టీ ప‌రిస్థితి అటు ఇటుగా ఉంది. పైగా పార్టీ పుట్టిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా.. ఒక చోట బ‌ల‌హీనంగా ఉన్నప్ప‌టికీ.. 2013 కార్పొరేష‌న్ ఎన్నిక్ల‌లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కి.. మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంది.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి భిన్నంగా ఉంది. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఎవ‌రికి వారు.. మేయ‌ర్ పీఠంపై క‌న్నేయ‌డంతోపాటు.. ఎంపీ కేశినేని నాని వైఖ‌రితో విభేదిస్తున్నారు. నాని.. అంద‌రినీ క‌లుపుకొని వెళ్లాల‌న్న క‌నీస ఫార్ములాను ప‌క్క‌న పెట్టారు. ఎవ‌రినీ ప‌ట్టించుకోకుండా.. తాను మాత్ర‌మే నాయ‌కుడిని.. అన్న త‌ర‌హాలో ముందుకుసాగుతున్నార‌నే విమ‌ర్శ‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇది.. ఏకంగా పార్టీ అధినేత చంద్ర‌బాబుతోనూ ఆయ‌న‌కు గ్యాప్ పెంచ‌డం గ‌మ‌నార్హం. తాజాగా.. ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ‌ర్గంతో న‌డిరోడ్డుపై వివాదానికి దిగ‌డం.. నాఇష్టం వ‌చ్చిన‌ట్టు చేస్తాను. ఏదైనా ఉంటే.. చంద్ర‌బాబుకు చెప్పుకోండి! అన్న విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌.. పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

పార్టీని నిల‌బెట్టిన వారిలో కొంద‌రు మాత్ర‌మే ఇప్పుడు జీవించి ఉన్నారు. ఇక‌, పార్టీని నిల‌బెడ‌తామ‌ని ప‌ద‌వులు పుచ్చుకున్నవారు.. టికెట్లు తీసుకుని గెలిచిన వారు ఇప్పుడు వ్య‌క్తిగ‌త స్వార్థాల‌కు తెర‌దీస్తుండ‌డంతో.. టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. మ‌రోకీల‌క హెచ్చ‌రిక ఏంటంటే.. విజ‌య‌వాడ‌లో టీడీపీని డెవ‌ల‌ప్ చేసిన దేవినేని నెహ్రూ వార‌సుడు ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. దీంతో ఆ వ‌ర్గం అంతా ఇప్పుడు టీడీపీకి దూర‌మైంది. సో.. ఎటు చూసినా.. టీడీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉన్న నేప‌థ్యంలో త‌మ్ముళ్లు త‌గువులాట‌తో మ‌రింత ప్ర‌మాదంలోకి వెళ్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.