విశాఖ స్టీల్స్ పై జగన్మోహన్ రెడ్డిది డబుల్ గేమేనా ? పార్లమెంటు సమావేశాల్లో కేంద్రమంత్రి సమాధానం చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని కేంద్ర క్యాబినెట్ డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఉక్కు నగరంలో జరుగుతున్న ఆందోళనలను అందరు చూస్తున్నదే. స్టీల్ ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులతో మొదలైన ఆందోళనలు తర్వాత రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో తీవ్రరూపం దాలుస్తోంది.
సరే వివాదం అన్నాక వెంటనే ఒకవైపు వైసీపీ మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు కారణం మీరేనంటే కాదు మీరే అంటు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగాయి. నిజానికి ఉక్కు పరిశ్రమ కోసం చేయాల్సిన ఆందోళనలు పార్టీలకు అతీతంగా జరగాల్సిన అవసరాన్ని కూడా పక్కన పెట్టేసి రాజకీయంగా ఒకళ్ళపై మరకొళ్ళు బురద చల్లుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తు పోస్కో ఆధ్వర్యంలో ప్లాంటు పెట్టటానికి 2019, అక్టోబర్లోనే నిర్ణయం జరిగిందని చెప్పారు.
విశాఖ స్టీల్స్ ఫ్యాక్టరీలో ఉన్న మిగులుభూమిని తీసుకుని కొరియా ఆధ్వర్యంలోని పోస్కో ఉక్కు కంపెనీ ఒక ప్లాంట్ పెట్టాలనే నిర్ణయం రాష్ట్రప్రభుత్వానికి స్పష్టంగా తెలుసన్నారు. కొరియా కంపెనీ పెట్టబోయే స్టీల్ ఫ్యాక్టరీలో ఎవరి వాటా ఎంత అనే విషయం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదన్నారు. అక్కడి భూమి ధర, ప్లాంటు అంచనా పెట్టుబడి లాంటి అనేక అంశాలు నిర్ణయమైన తర్వాత ఎవరికి ఎంత వాటా అన్నది తేలుతుందని కేంద్రమంత్రి చెప్పారు. అయితే దీనికి సంబంధించిన కీలక సమావేశం 2018, అక్టోబర్లోనే జరిగిందని ప్రధాన్ చెప్పారు.
తాజాగా కేంద్రమంత్రి చెప్పిన సమాధానం ప్రకారం చూస్తే 2019 లో విశాఖ స్టీల్స్ లోని మిగులుభూమిలో పోస్కో ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయమైందటే అపుడు సీఎం జగనే కదా.
అంటే వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు హయాంలో కేంద్రం ప్రతిపాదించింది.. కానీ చంద్రబాబు ముందుకు తీసుకెళ్లలేదు. జగన్ హయాంలో నిర్ణయం జరిగి, చకచకా ఒప్పందాలు జరిగిపోయి అమల్లోకి వచ్చిందన్న విషయం తెలిసిపోతోంది. ఈ విషయాన్ని జనాలకు తెలీదని అనుకున్నారో ఏమో కేంద్రమంత్రి ఏపీ పెద్దల డబుల్ గేమును ఒకేసారి పార్లమెంటు సాక్షిగా బయటపెట్టారు. పార్లమెంటులో అసలు విషయం బయటపడిన తర్వాత ఇంకా ఆందోళనలని, పార్టీ రహితంగా ఉద్యమాలని, ప్రధానమంత్రికి లేఖలు రాయటమనే డ్రామాలు ఎందుకు కంటిన్యు చేస్తున్నారు ?