మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎపిసోడ్.. ఫిఫ్టీ -ఫిఫ్టీ అన్నట్టుగా ముగిసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. ఆయన చేస్తున్న వివాదాస్పద కామెంట్లను అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21 వరకు అంటే.. పంచాయతీ పోరు ముగిసే వరకు కూడా పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిని అమలు చేయాలని డీజీపీని ఆదేశించారు.
ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌పై ఆదేశాలు చెల్లవని చెప్పిన హైకోర్టు.. మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రం హైకోర్టు సమర్థించింది. మంత్రి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదన్న ఎస్ఈసీ ఉత్తర్వులను సమర్ధించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని మంత్రిని హైకోర్టు ఆదేశించింది.
కాగా, తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇంటికి ఎలా పరిమితం చేస్తారని పెద్ది రెడ్డి తరఫున ఆయన న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు.. పెద్దిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది చెప్పారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపారు. మొత్తానికి ఎస్ ఈసీ వర్సెస్ పెద్దిరెడ్డి ఎపిసోడ్‌కు హైకోర్టు తనదైన తీర్పు ఇవ్వడం ద్వారా ముగించిందనే అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates