మద్యం మహమ్మారిని కట్టడి చేసే విషయంలో తనకున్న విజన్ ను ప్రదర్శిస్తోంది ఏపీ సర్కారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మద్యం అమ్మకాల విషయంలోనూ.. సరఫరా విషయంలో సరికొత్త విధానాల్ని తెర మీదకు తేవటం తెలిసిందే. కరోనాకారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం అమ్మకాల్ని పూర్తిగా బంద్ చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇటీవల మద్యం అమ్మకాల్ని మళ్లీ మొదలు పెట్టింది ఏపీ సర్కారు.. మందుబాబులకు దిమ్మ తిరిగే షాకిచ్చింది. మందు చుక్క గొంతులోకి వెళ్లటానికి ముందే మత్తు ఎక్కని మాటను చెప్పేసింది.ఏపీలో మద్యం ధరల్ని 75 శాతానికి పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ధరల్ని భారీగా పెంచటం ద్వారా మద్యం అలవాటును తగ్గించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అయినప్పటికీ మందుబాబుల జోరు ఏ మాత్రం తగ్గలేదు. మద్యం అమ్మకాలు జోరున సాగుతున్నాయి. మద్యం కోసం పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఇలాంటివేళ.. ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తసుకుంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్ని 33 శాతం తగ్గించి షాకిచ్చింది.
వాస్తవానికి ఏపీలో 4380 లిక్కర్ షాపులు ఉంటే.. వాటిని జగన్ సర్కారు 3500కు తగ్గించాయి. గతంలో మాదిరి ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వారు మద్యం దుకాణాల్ని నిర్వహించే వారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుఖాల్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.
తాజాగా ఈ షాపుల్ని 2934కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా పలుమద్యం షాపుల్ని తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం మందుబాబులకు నిరుత్సాహాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. మందు అమ్మే షాపులు మరింత తగ్గితే.. మందుబాబుల హడావుడి మరింత ఎక్కువ అవుతుంది. అదే జరిగితే లొల్లి ఖాయం.