మ‌న్యంలో మార్పు.. వైసీపీకి షాకు..!

అల్లూరు సీతారామ‌రాజు జిల్లా స‌హాపార్వ‌తీపురం మ‌న్యంలో వైసీపీ పుంజుకుంది. అయితే. ఇది స్థానిక సంస్థల ఎన్నిక‌లకే ప‌రిమితం అయింది. నిజానికి కూట‌మి ప్ర‌భుత్వం.. ప్ర‌భావం రాష్ట్ర వ్యాప్తంగా క‌నిపించింది. దీంతో జ‌న‌సేన‌ పార్టీకి మ‌న్యంలో మెరుగైన ఫ‌లితం వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయిన‌ప్ప‌టికీ మ‌న్యంలో వైసీపీ పుంజుకుంది. ఎంపీటీసీ, జ‌డ్పీ స్థానాల‌ను ద‌క్కించుకుంది. కానీ.. తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కులు క‌ల‌సి క‌ట్టుగా ప‌ని చేశారు. దీంతో వైసీపీ చతికిల ప‌డింది.

అతి విశ్వాసం.. వైసీపీని ఇబ్బందుల‌కు గురిచేసింద‌ని అంటున్నారు. పార్టీలో కొందరు నాయ‌కులు ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన విజ‌య‌మే ఇప్పుడు కూడా వ‌స్తుంద‌ని అంచ‌నా వేశారు. దీంతో ప్ర‌చారం కంటే కూడా.. ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయ్యారు. మ‌రోవైపు ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం, అనంత‌రం.. పార్టీలు అలెర్ట్ కావ‌డంతో కూట‌మి పార్టీల నాయ‌కులు అలెర్ట్ అయ్యారు. దీంతో మ‌న్యంలో కూట‌మి పార్టీలు.. ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. దీంతో తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తుతో రంగంలోకి దిగిన వారు ఓడిపోయారు.

మన్యంలో పంచాయతీలోని గూడెంకొత్తవీధి మండలంలోని మేజరు పంచాయతీ సీలేరులో కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కానీ, తాజాగా కూట‌మి పార్టీలు విజ‌యం సాధించాయి. ముఖ్యంగా కీల‌క‌మైన చింతపల్లి పంచాయ‌తీని ద‌క్కించుకునేందుకు టీడీపీ నాయ‌కులు కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి ఇంటింటికీ తిరిగిప్ర‌చారం చేశారు. గిరిజ‌నుల‌తోపాటు ఇత‌రుల ఓట్ల‌ను కూడా కూట‌మికి ప‌డేలా చ‌క్రం తిప్పారు. దీంతో చింత‌ప‌ల్లిలో టీడీపీ మ‌ద్ద‌తు దారు విజ‌యం ద‌క్కించుకున్నారు.

అలానే.. గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి ధారకొండ, మొండిగెడ్డ, దేవరాపల్లిలోనూ కూట‌మి బ‌లంగా పోరాడింది. ఫ‌లితంగా టీడీపీ మ‌ద్దతు దారులు విజ‌యం సాధించారు. ఇదేమండ‌లం ప‌రిధిలోకి వ‌చ్చే రింతాడ, సంకాడ పంచాయ‌తీల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. మ‌రోవైపు.. ఇక్క‌డ త‌మ విజ‌యం ఖాయ‌మ‌ని ముందు నుంచి చెబుతూ వ‌చ్చిన వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం త‌గ్గించ‌డంతో.. పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. నిజానికి రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితి ఉన్నా.. మ‌న్యంలో విజ‌యంపై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి ఇది భారీ షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి.