21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ల మధ్య రాజకీయ విభేదాలున్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన హరీశ్ రావు ఆ తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతగా మారారు. కానీ, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన జగ్గారెడ్డి మాత్రం 21 ఏళ్లుగా ఆ పార్టీలోనే ఉన్నారు. 2004లో అంటే వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు హరీశ్ రావు ఛాంబర్ లో కూర్చొని జగ్గారెడ్డి భోజనం చేసేవారు. ఆ ఇద్దరు నేతలు అంత క్లోజ్ అన్నమాట.

అయితే, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. 21 ఏళ్లుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు నేతలు మళ్లీ కలిశారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి, కోడలు పాలక్ పటేల్ నిర్వహించిన సత్యనారాయణ వ్రతం సందర్భంగా వారిని ఆశీర్వదించేందుకు జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా ఈ ఇద్దరు నేతలు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అయితే, తమ కలయికలో ఎలాంటి రాజకీయాలు, మతలబులు లేవని, ఇది కేవలం వ్యక్తిగత కలయిక మాత్రమేనని జగ్గారెడ్డి క్లారిటీనిచ్చారు.

తాను కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు హరీశ్ రావును కలవలేదని చెప్పారు. గత పదేళ్లు హరీశ్ మంత్రిగా, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎన్నడూ కలవలేకపోయానని అన్నారు. తన కూతురి పెళ్లికి హరీశ్‌ ను పిలవలేకపోయానని, ఈసారి కుమారుడి పెళ్లి వేడుకకు ఆయనను తప్పకుండా పిలవాలని అనుకున్నానని చెప్పారు. హరీశ్ రావు బీఆర్‌ఎస్‌లో అగ్రనేత అని, తాను కాంగ్రెస్‌లో ఒక స్థాయి నాయకుడినని, రాజకీయాలు వేరని, తాము వ్యక్తిగతంగా ఒకరినొకరు ఏనాడూ విమర్శించుకోలేదని అన్నారు.