ఎన్ని జిల్లాల్లో వైసీపీ ఉనికిని చాటుకుంది?

స్థానిక ఎన్నికలలో వైసీపీ ప్రభావం అనేక జిల్లాల్లో నామమాత్రంగా కనిపించింది. మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ముందు నిలబడేందుకు, కలబడేందుకు నానా తంటాలు పడింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు పర్వాలేదనేలా ఉన్నా.. అనేక జిల్లాల్లో నిరాశకు గురి చేసింది. కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే వైసీపీ అధిక మోతాదులో ఉనికి చాటుకుంది. మిగిలిన జిల్లాల్లో అంతంతమాత్రంగా పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది.

గుంటూరు, విశాఖపట్నంలో తొలి విడతలో ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో వైసీపీ పట్టు కోల్పోయింది. ఇక్కడ 126 పంచాయతీలలో ఎన్నికలు జరిగితే కూటమి బలపరిచిన అభ్యర్థులు 88 చోట్ల విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 36 చోట్ల మాత్రమే విజయం సాధించారు. జగన్ సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇలా వుంటే మిగిలిన నియోజకవర్గాల్లో మరింతగా దిగజారింది. 

శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 35శాతం నుంచి 40శాతం స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో 25శాతం నుంచి 35శాతం స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 25శాతం కంటే తక్కువ స్థానాలు గెలుచుకుంది. కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పోలవరం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రం వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నాలుగు జిల్లాల్లో 40శాతానికి మించి గెలుచుకోవడం గమనార్హం. 

కృష్ణాజిల్లాలో 121 పంచాయతీలకు గాను కూటమి 63 స్థానాల్లో, వైసీపీ  51 స్థానాల్లో గెలిచారు. గన్నవరం నియోజకవర్గంలో 78 పంచాయతీలలో టీడీపీ 34 చోట్ల, వైఎస్సార్‌సీపీ 37 చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలో ఇంకా రెండు విడతలుగా ఎన్నికలు జరగాల్సి వుంది. మరో రెండున్నారేళ్ళ కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పటికైనా వైసీపీ బలం పెంచుకుంటుందో, మరింతగా క్షిణిస్తుందో వేచి చూడాలి.