‘ఒరే.. మేం బానే ఉంటాం.. మీరెందుకురా గొడ‌వ ప‌డేది’

అనంత‌పురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌లను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చిత్రంగా ఉన్నాయ‌ని అంటున్నారు. వాస్త‌వానికి అనంత‌పురం జిల్లాలో ఇరు పార్టీల మ‌ధ్య కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల నుంచి దాడుల వ‌ర‌కు లెక్కేలేదు. ఇక‌, కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రు రెచ్చ‌గొడుతున్నార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే.. తాజాగా ఏం జ‌రిగిందో ఏమో.. తెలియ‌దు కానీ.. జేసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కార్య‌క‌ర్త‌లు-కార్య‌క‌ర్త‌లు ఘ‌ర్ష ణ‌ల‌కు దిగితే.. న‌ష్ట‌పోయేది వారేన‌ని చెప్పారు. ఒరే నాయ‌కులుగా మేం మేం బాగానే ఉంటాం. మీరెందుకురా గొడ‌వ ప‌డేది అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గొడ‌వ‌లు ప‌డొద్దంటూ ఆయ‌న సూచించారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్న జేసీ ఫ్యామిలీ.. తాడిప‌త్రిలో 40 ఏళ్లుగా ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పుతున్న విష‌యం తెలిసిందే.

నిన్న‌టి వ‌ర‌కు కూడా తాడిప‌త్రిపై జేసీ అజ‌మాయిషీ అంద‌రూ చూశారు. ఏకంగా కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి పోలీసు స్టేష‌న్ ముందే.. ఆయ‌న ధ‌ర్నాకు దిగారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కారాలు మిరియాలు కూడా నూరుతున్నారు. అలాంటి నాయ‌కుడిలో ఒక్క‌సారిగా మార్పు రావ‌డం ఏంట‌నేది ప్ర‌ధాన చ‌ర్చ‌. రాజకీయ గొడవల్లో నష్టపోయేది కింది స్థాయి కార్యకర్తలే. మేం ఎప్పుడూ బాగానే ఉంటాం వివాదాలతో కార్యకర్తలే నష్టపోతారు. ఈ విషయం గుర్తించి గొడవల జోలికి వెళ్లవద్దు అని ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఎందుకు?

స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ముఖ్యంగా జేసీ అనుచ‌రులు పెద్ద సంఖ్య‌లో వైసీపీ నాయ‌కుల నివాసాల‌పై దాడులు చేశారు. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని య‌ల్ల‌నూరు, పుట్టూరు, యాడికిలో వైసీపీ మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల కార్లు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆదేశాల మేర‌కు.. వారిపై కేసులు న‌మోద‌య్యాయి. సుమారు 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించార‌ని అంటున్నారు.