ఏపీలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ పాలనతో ప్రజల మన్ననలు పొందిన కూటమి ప్రభుత్వం విజయం ఊహించినదే. అయితే, ఆడలేక మద్దెల ఓడు అన్న రీతిలో వైసీపీ నేతలు రిగ్గింగ్, బూత్ క్యాప్చర్ అంటూ పస లేని నిరాధార ఆరోపణలతో విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేతలకు వైఎస్ షర్మిల కూడా వత్తాసు పలికారు.
ఓట్లు మీరే వేసుకున్నారు, గెలుపు మీదేనని ప్రకటించుకున్నారు, ఇక, ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటి ? అని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో పారదర్శకత అనేదానికి విలువ లేదని, స్వేచ్ఛ, నిష్పక్షపాతం అనేదానికి అర్థం లేదని విమర్శలు గుప్పించారు.
కూటమి పార్టీల విజయం ప్రజా తీర్పు కాదని, అధికార మదానికి, రాక్షసతత్వానికి తార్కాణం అని ఘాటుగా విమర్శించారు. ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలను అణచివేసి, సాధించిన బలవంతపు విజయభేరి ఇది అని మండిపడ్డారు.
ఎన్నికల సంఘాన్ని కూటమి సంఘం చేసి,పోలీసు వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుని ఈ ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. భారత దేశ ఎన్నికల వ్యవస్థకే ఇది సరికొత్త నిర్వచనం అని ఎద్దేవా చేశారు. పవిత్రమైన ఓటు హక్కును కాలరాసి దేశం ముందు ఏపీ పరువు తీసిన కూటమి పార్టీలు సిగ్గుపడాలి విమర్శలు గుప్పించారు. ఇది వ్యవస్థల విధ్వంసానికి పరాకాష్ట అని ప్రజలు గుర్తించాలని కోరారు.
ఈ క్రమంలోనే షర్మిలపై విమర్శలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు..ఒకవేళ ధైర్యం చేసి కొందరు పోటీ చేసినా డిపాజిట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అటువంటి పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates