టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగినా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న అసంతృప్తుల కారణంగా.. ఆయా పార్టీల నుంచి రెబల్స్ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈ క్రమంలో చాలా మంది నాయకులపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయినప్పటికీ వారేమీ వెనక్కి తగ్గలేదు. మెజారిటీ నాయకులు బరిలోనే ఉన్నారు. పోటీ చేశారు. పోలింగ్ అనంతరం.. తాజాగా వచ్చిన కౌంటింగ్‌లో మెజారిటీ స్థానాల్లో రెబల్స్ కూడా విజయం దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు వీరు ఏ దారి పడతారు? అనేది ఆసక్తిగా మారింది.
- నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన టికెట్ ఆశించి భంగ పడిన రెబల్ అభ్యర్థులు ఇద్దరు ఒంటరిగానే పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో వారు విజయం దక్కించుకున్నారు. ఇద్దరూ కూడా మహిళలే కావడం గమనార్హం. 11, 12 వార్డుల్లో ఈ మహిళా నాయకులు విజయం సాధించారు.
- ఉమ్మడి అనంతపురం జిల్లా లో కూడా ముగ్గురు టీడీపీ రెబల్స్ నాయకులు విజయం దక్కించుకున్నారు. విజయనగరంలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, గుంటూరు ఒకరు, బాపట్ల జిల్లాలో ఇద్దరు చొప్పున రెబల్ క్యాండిడేట్లు గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ.. ఇద్దరేసి చొప్పున స్వతంత్రులుగా రంగంలోకి దిగిన టీడీపీ అభ్యర్థులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరంతా టీడీపీ అభ్యర్థులను ఓడించి.. గెలవడం గమనార్హం.
కూటమి అప్రమత్తం..
వాస్తవానికి ఎన్నికల వేళ రెబల్స్‌పై వేటు వేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు అప్రమత్తం అయ్యాయి. గెలుపు పొందిన రెబల్స్.. వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుసుకుని.. సీనియర్ నాయకులు గెలిచిన వారితో చర్చలు జరుపుతున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని కోరుతున్నట్టు తెలిసింది. అయితే.. దీనిపై రెబల్స్ నుంచి ఇంకా సమాచారం రాలేదు. మరోవైపు.. రెబల్స్‌గా బరిలో నిలిచి గెలిచిన వారిని వైసీపీ కూడా బుజ్జగిస్తోంది. తమ పార్టీలోకి రావాలిని కోరుతున్నట్టు సమాచారం. మొత్తంగా రెబల్స్ గెలుపు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates