వైసీపీ ఎంపీ ‘అతి’కి సుప్రీం బ్రేక్

వైసీపీ తిరుప‌తి ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. “ఎంపీగారు అతిగా స్పందిస్తున్నారు. ఇలా అయితే.. భారీ జ‌రిమానాను ఎదుర్కొనాల్సి ఉంటుంది.. ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పండి” అంటూ.. గురుమూర్తి త‌ర‌ఫున న్యాయ‌వాదికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం అల‌వాటుగా మారిపోయింద‌ని వ్యాఖ్యానించింది. ఇలా అయితే.. కోర్టుల‌కు రాజ‌కీయ నేత‌లు మిన‌హా సామాన్యులు వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. ఇలాంటి వాటిని అరిక‌ట్టేందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఎందుకింత ఆగ్ర‌హం?

విజ‌య‌వాడ కృష్ణలంక‌కు చెందిన గాదె సాయికృష్ణ‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం.. అనంత‌రం.. అత‌ను క‌స్ట‌డీలో మ‌ర‌ణించార‌ని వార్త‌లు రావ‌డం తెలిసిందే. అయితే.. దీనిపై ఇంకా విచార‌ణ సాగుతోంది. మ‌రోవైపు.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారిని అధికారులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సీఐ స‌హా కానిస్టేబుళ్లు, సీఐ మిత్రుడు కూడా ప్ర‌స్తుతం జైల్లోనే ఉన్నారు. మ‌రోవైపు ఈ కేసు విచార‌ణ‌ను .. హైకోర్టే నేరుగా సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. పూర్తిస్థాయి విచార‌ణ జ‌ర‌గాల‌ని.. పోలీసు వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం రావాలంటే సీబీఐ విచార‌ణ త‌ప్ప‌ద‌ని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

అయితే.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించినా.. కొన్ని విష‌యాల్లో ప్ర‌భుత్వం, పోలీసులు కేసును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని.. ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ముఖ్యంగా ఈ కేసులో విజ‌యవాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్‌బాబు, అలానే డీజీపీ హ‌రీష్‌కుమార్ గుప్తాల పేర్లు కూడా చేర్చాల‌ని.. ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాల‌ని.. త‌క్ష‌ణ‌మే వారిని బాధ్య‌త‌ల నుంచి ప‌క్క‌న పెట్టి.. వారిని కూడా విచారించాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే 2 మాసాల కింద‌టే.. ఆయ‌న సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై ప‌లు ద‌ఫాలుగా విచార‌ణ జ‌రిగింది.

తాజాగా మంగ‌ళ‌వారం మ‌రోసారి ఈ కేసు విచార‌ణ‌కు రాగా.. వైసీపీ ఎంపీ గురుమూర్తికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ఆయ‌న పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు… ఇది పూర్తిగా రాజ‌కీయ కోణంలో ఉంద‌ని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. సాయికృష్ణ కుటుంబ స‌భ్యులు పిటిష‌న్లు వేశార‌ని.. వాటి ప్ర‌కారం హైకోర్టు కూడా స్పందించింద‌ని.. సీబీఐ విచార‌ణ కూడా జ‌రుగుతోంద‌ని.. ఇంకా దీనిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏం చేయాల‌ని ప్ర‌శ్నించింది. ఇలాంటి పిటిష‌న్ల‌కు అవ‌కాశం ఇస్తే.. సామాన్యుల పిటిష‌న్ల‌ను ఎప్పుడు విచారించాల‌ని ప్ర‌శ్నించింది. ఇంకో సారి ఇలాంటి పిటిష‌న్లు వేసే వారిపై భారీ జ‌రిమానాలు విధించాల్సి ఉంటుంద‌ని.. ఎంపీ అతి చేస్తున్నార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.