ఓటుకు 4 వేలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు

ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇవ్వడం చట్టపరంగా నేరం. కానీ, మన దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ చట్టం అందరికీ చుట్టం అయిపోతుంది. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని నచ్చిన వారికి ఓటు వేసే ఓటర్ మహాశయులు ఎందరో ఉన్నారు. ఇక, ధర్మబద్ధంగా ఆలోచించి ఇంట్లోని సభ్యులు తలా ఒక పార్టీకి ఓటు వేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా, ఓట్ల పండుగ నోట్ల పండుగ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వచ్చిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ తరఫున తాము ఓటుకు 2000 ఇద్దాం అనుకున్నామని, టీడీపీ తరఫున ఇంకొక 2000 మొత్తం..కలిపి ఓటుకు 4000 వస్తాయని పేదలు ఎంతో ఆశగా ఎదురు చూశారని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి‌. ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే మొత్తం 16,000 వస్తాయని దసరా పండుగ నాడు సంతోషంగా గడపవచ్చని పేద ప్రజలు అనుకున్నారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటర్లే కాదు తాను కూడా అంతే అనుకున్నాను అని, కానీ టీడీపీ వాళ్ళు ఏకగ్రీవాలు చేయడంతో ఆ అవకాశం లేకుండా పోయిందని పాపం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, తమ 2000 కూడా కలిపి మొత్తం ఓటర్లకు ఒక్కొక్క ఓటుకు 4000 ఇవ్వాలని రాచమల్లు సెలవిచ్చారు‌. ఇలా, బాధ్యతగల మాజీ శాసనసభ్యుడు ఓటుకు నోటు గురించి ఇంత బహిరంగంగా మీడియా సమావేశంలో మాట్లాడడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలాగా రాచమల్లు మాట్లాడారని ఇలా ఓటుకు నోటు ఇస్తున్నామని చెప్పడం ఏంటని నెటిజనులు మండిపడుతున్నారు‌. అందుకే వైసిపి నేతలు 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని, ఓటుకు నోటు, ఓట్లకు డబ్బులు ఇస్తే గెలిపిస్తారనే భ్రమలో ఉన్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.