పెద్దిరెడ్డి చేతులెత్తేస్తే జగన్ ఊరుకుంటారా?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే.. అన్ని మునిసిప‌ల్ స్తానాల్లోనూ వైసీపీ పోటీ చేయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌మ వారంతా.. నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకుంటార‌ని.. ఇప్ప‌టికీ నామినేష‌న్లు వేయ‌నివారు.. ఇక‌పై వేయ‌బోర‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తిప‌క్షాల‌ను భ‌య‌పెట్టి గెలిచే సంస్కృతిని టీడీపీ అల‌వ‌రుచుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు.

చంద్ర‌బాబుకు శాప‌నార్థాలు..

పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. ఇది కూట‌మి ప్ర‌భుత్వం కాద‌ని.. అరాచ‌క ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు. అంతేకాదు… ప్ర‌భుత్వ అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని.. ఈ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని శాప‌నార్థాలు పెట్టారు. చంద్ర‌బాబుకు వ‌య‌సు వ‌చ్చింది కానీ.. బుద్ధి రాలేద‌ని అన్నారు. సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేసి.. పెట్టుబ‌డులు తెచ్చి.. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే.. ఇంత‌గా ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌డం లేద‌ని(పుంగ‌నూరు వ‌ర‌కు) తేల్చి చెప్పారు.

జ‌గ‌న్ నిర్ణ‌య‌మేనా?

స్థానిక ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఏకగ్రీవాలు జ‌ర‌గ‌రాద‌ని.. పోటీ అనివార్యంగా ఉండాల‌ని చెబుతూ వ‌చ్చిన జ‌గ‌న్ కు.. పెద్దిరెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌కు మ‌ధ్య తేడా కొడుతోంది. అన్ని స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌పాల‌న్న జ‌గ‌న్‌.. ఒక‌వేళ లేక‌పోతే.. కుటుంబ స‌భ్యుల‌నైనా రంగంలోకి దింపాల‌ని సూచించారు. కానీ, పెద్దిరెడ్డి అనూహ్యంగా కీల‌క‌మైన త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే వైసీపీ నేత‌లు ఎవ‌రూ పోటీ చేయ‌ర‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇది జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌య‌మా? లేక పెద్దిరెడ్డి సొంత నిర్ణ‌య‌మా? అనేది ఆస‌క్తిగా మారింది.

నోటీసులు..

మ‌రోవైపు.. పుంగ‌నూరులో నామినేష‌న్ల ఘ‌ట్టం తొలిరోజు శుక్ర‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను తీవ్రంగా భావి స్తున్న పోలీసులు.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు.. ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఈ నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే రాజంపేట ఎంపీ, పెద్దిరెడ్డి వార‌సుడు మిథున్‌రెడ్డికి ఆదివారం ఉద‌యం బీఎన్ ఎస్ చ‌ట్టంలోని 168 సెక్ష‌న్ ప్ర‌కారం నోటీసులు ఇచ్చారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రారాద‌ని తేల్చి చెప్పారు. దీంతోవారు పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకున్నారు. అయితే.. కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.