ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే జగన్ ఓడిపోయారని చాలామంది వైసీపీ నేతలు, అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. ఏదో జరిగిందని, కానీ, ఆధారాలు లేవని వైసీపీ అధినేత జగన్ కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొందరు ఈవీఎంల పనితీరుపై కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలోనే 2024లో ఈవీఎంల వల్లే జగన్ ఓటమి పాలయ్యారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ ఎలా ఓడిపోతారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిందని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ 14 మీటింగులు పెడితే 10 మీటింగులలో ఆయన అభిప్రాయంతో మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు విభేదించారని గుర్తు చేశారు. ముగ్గురిలో ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకంచారంటే అర్థం చేసుకోవాలని చెప్పారు. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని, కేంద్ర ఎన్నికల కమిషన్ లో పెద్ద కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని, అందుకే 73 లక్షల ఓట్లు తొలగించాలని కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకోసం పోరాటం చేస్తామని, ఎంతవరకైనా వెళ్తామని కోమటిరెడ్డి చెప్పారు.