విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ లోని కొన్ని నిర్దిష్ట డివిజన్లు/వార్డులలో రాజకీయాలు మునిసిప‌ల్ ఎన్నిక‌ల చుట్టూ తిరుగుతున్నాయి. అంతర్గతంగా 4 రాజకీయ విభాగాలుగా విభజించుకుని రాజకీయాలు నడుపుతున్నారు. డివిజన్ల వారీగా రాజకీయ ప్రభావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పాత బస్ స్టాండ్, గవర్నర్‌పేట, గాంధీనగర్ పరిసర ప్రాంతాల‌లో వ్యాపార వ‌ర్గాలు.. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు.

ఇక్క‌డి సంప్రదాయ టీడీపీ ఓటు బ్యాంకు, కూటమిలోని జ‌న‌సేన‌, బీజేపీల‌కు కూడా ఓటు బ్యాంకు ఉండ‌డం వంటివి రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్ ల‌లో మధ్యతరగతి ఓటర్లు, ఉద్యోగులు ఎక్కువ. ఇక్కడ కమ్యూనిస్టులు, టీడీపీల ప్రభావం గట్టిగా ఉంటుంది. పాయకాపురం, ప్రకాష్ నగర్, కండ్రిక వంటి ప్రాంతాలలో శ్రామిక, నిరుపేద వర్గాలు.. ఎస్సీ , మైనారిటీ ఓటర్లు ఉన్న ప్రాంతాలు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీర్టీ కి ఈ డివిజ‌న్ల‌లో మంచి ఓట్లు ప‌డ్డాయి. దీంతో ఇప్పుడు టీడీపీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

సెంట్ర‌ల్ నియోజకవర్గంలో మండలాలు లేకపోయినా, కులాల సమీకరణాలే గెలుపోటములను శాసిస్తాయి. కమ్మ, కాపు సామాజిక వర్గాలు(వివిధ ఉప‌కులాలు కూడా) రాజకీయంగా అత్యంత క్రియాశీలంగా మారాయి. బీసీ, ఎస్సీ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ విజయం ఖాయమవుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని గ‌మ‌నిస్తే.. కూటమి ఆధిపత్యం క‌నిపిస్తున్నా.. అదే స‌య‌మంలో వివిధ వార్డుల్లో బీజేపీ, జ‌న‌సేన కూడా పాగా వేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ప్రస్తుతం నియోజకవర్గంలోని మెజారిటీ డివిజన్లలో టీడీపీ గట్టి పట్టు సాధించింది. జనసేన ఓటు బ్యాంక్ కూడా ఇక్కడ కూటమికి బ‌ల‌మైన పోటీ దారుగా ఉంది. గతంలో 2019లో ఇక్కడి నుండి గెలిచిన మల్లాది విష్ణు ప్రభావం కొంత తగ్గినప్పటికీ, సింగ్ నగర్ లోని కొన్ని డివిజన్లలో వైసీపీ క్యాడర్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

అలాగే ఇక్కడ సీపీఎం పార్టీకి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది .సంక్షిప్తంగా చెప్పాలంటే, విజయవాడ సెంట్రల్‌లో మండలాల వారీ రాజకీయాలు కాకుండా, పూర్తిగా నగర డివిజన్లు, సామాజిక సమీకరణాలు,. స్థానిక డివిజన్ నేతల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. వాటిలో కూట‌మి పార్టీల స‌ఖ్య‌త లేక‌పోతే.. టీడీపీకి ఇబ్బందేన‌న్న చ‌ర్చ ఉంది.