వెటరన్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభంను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. శనివారం మధ్యాహ్నం ముద్రగడ ఇంట్లో ఆయనతో భేటీ అయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు దగ్గర్లోని కిర్లంపూడి ముద్రగడ స్వగ్రామమన్న విషయం అందరికీ తెలిసిందే. కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడను ఎలాగైనా పార్టీలోకి తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఉపయోగం ఉంటుందని వీర్రాజు పెద్ద ప్లాన్ వేశారు.
ముద్రగడ పార్టీలో చేరటం వల్ల బీజేపీకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందనే విషయం ఇఫ్పటికిప్పుడు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ముద్రగడ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. భేటీ తర్వాత వీర్రాజు మాట్లాడుతూ ‘ముద్రగడ ముందు పెద్ద లక్ష్యాన్ని ఉంచాము’ అని చెప్పారు. మరి ముద్రగడ ముందు పెట్టిన అంతపెద్ద లక్ష్యం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
నిజానికి ఎటువంటి లక్ష్యాన్ని కూడా చేరుకునేస్ధితిలో ముద్రగడ లేరన్న విషయం అందరికీ తెలిసిందే. జనజీవనస్రవంతికి దూరంగా ముద్రగడ జరిగి చాలా కాలమైపోయింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆచరణసాధ్యంకాని డిమాండ్ తో కొంతకాలంపాటు ముద్రగడ కాస్త హడావుడి చేయటం మినహా ఇంక చేసిందేమీ లేదు. ఇటువంటి పరిస్దితిల్లో ముద్రగడను యాక్టివ్ రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. పరిస్దితులన్నీ అనుకూలిస్తే ఈ కాపు నేతను కాకినాడ ఎంపిగా కానీ లేకపోతే కాకినాడ ఎంఎల్ఏగా కానీ పోటీ చేయించాలన్నది కమలంపార్టీ ఆలోచనగా తెలుస్తోంది.
కాపు సామాజికవర్గం కోసమే అంతర్లీనంగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాగూ మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ముద్రగడ కూడా కలిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించినట్లవుతుందని బహుశా వీర్రాజు అనుకుంటున్నారేమో. ఉభయగోదావరి జిల్లాల్లో కాపులదే మెజారిటి కాబట్టి ముద్రగడ పార్టీలో చేరితే బీజేపీకి తిరుగుండదని వీర్రాజు పెద్ద అంచనాలే వేసుకున్నట్లున్నారు. అందుకనే ముద్రగడ ముందు పెద్ద లక్ష్యాన్ని ఉంచినట్లు చెప్పుకున్నారు. మరి ముద్రగడ లక్ష్యాన్ని చేరుకోగలరా ? చూద్దాం ఏమి జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates