రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం… కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిల పోలీసులు అరెస్టు చేశారు. అయితే, స్పీకర్ పై వివాదాస్పద కామెంట్లకు నిరసనగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఫాం హౌస్ కు వెళుతున్న తమను అడ్డుకున్న పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.

కేసీఆర్ కు ఏమైనా అయితే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ ఇంటికి తనను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని, కానీ, కాంగ్రెస్ నేతలను ఫాం హౌస్ దగ్గరకు ఎలా పంపించారని ప్రశ్నించారు. ఏదైనా జరిగితే ఇబ్బంది పడేది పోలీసులేనని కేటీఆర్ హెచ్చరించారు. గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ గా సెక్యూరిటీ ఇచ్చి ఫాం హౌస్ కు పంపించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

శాసనసభకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులను ఆపవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పాటించడం లేదని విమర్శించారు. కోర్టుల పట్ల, చట్టం పట్ల కాంగ్రెస్ సర్కార్ కు ఉన్న అగౌరవానికి ఈ ఘటనలు నిదర్శనమని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఇలాగే ఉందా అని పోలీసు ఉన్నత అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతామని సవాల్ విసిరారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా?” అని కేటీఆర్ సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల చీరలు పట్టుకుని, మెడపై చేయివేసి దాడి చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.