జ‌గ‌న్ వ‌దిలేసిన ప‌నిని పూర్తి చేస్తున్నారు!

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ఏపీలోని 13 ఉమ్మ‌డి జిల్లాల‌ను విడ‌దీసి.. 26 జిల్లాలుగా మార్చారు. ఒక్కొక్క పార్ల‌మెంటు స్థానాన్ని ఒక్కొక్క జిల్లాగా ఆనాడు ప్ర‌క‌టించారు. అయితే.. ఆ త‌ర్వాత చేప‌ట్టాల్సిన కీల‌క ప‌నులు ఆయ‌న వ‌దిలేశారు. వీటిలో ప్ర‌ధానంగా రాజ‌కీయ ప్ర‌భావం చూపించే జిల్లా ప‌రిష‌త్‌ల‌ను ఆనాడు ఏర్పాటు చేయ‌లేదు. ఇది రాజ‌కీయంగానే కాకుండా.. పార్టీల‌కు కూడా అత్యంత కీల‌కం. అయితే.. కార‌ణాలు ఏవైనా కూడా.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం దీనిని ప‌ట్టించుకోలేదు. వైసీపీ నాయ‌కులు వెంట‌బ‌డి పోరాడినా.. ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు..

నిజానికి జిల్లా ప‌రిష‌త్‌లు ఏర్పాటు చేయ‌డం ద్వారా పార్టీల్లో ఉన్న ఆశావ‌హుల‌కు మెరుగైన, మేలైన అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఆనాడు మంత్రులుగా ఉన్న‌ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కుర‌సాల క‌న్న‌బాబు వంటివారు ఈ విష‌యాన్ని జ‌గ‌న్‌కు చెప్పారు. అయితే.. జిల్లాలు ఏర్పాటు చేశాం క‌దా.. త‌ర్వాత చూద్దాంలే.. అన్న‌ట్టుగా జ‌గ‌న్‌వాటిని వ‌దిలేశారు. ఇక‌, ఇప్పుడు రాజ‌కీయ చైత‌న్యం పెరుగుతుండ‌డం.. మ‌హిళ‌ల‌కు త్వ‌ర‌లోనే 33 శాతం రిజ‌ర్వేష‌న్ కూడా వ‌స్తున్న నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కారు కొత్త‌గా జిల్లా ప‌రిష‌త్‌ల‌ను ఏర్పాటు చేసింది.

జ‌గ‌న్ హ‌యాంలో ఏర్పాటు చేసిన కొత్త 26 జిల్లాల‌తోపాటు కూట‌మి స‌ర్కారు ఇటీవ‌ల తెచ్చిన మార్కాపురం, పోల‌వ‌రం జిల్లాల‌ను కూడా జిల్లా ప‌రిష‌త్‌లుగా గుర్తిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. త‌ద్వారా ఆయా జిల్లాల్లో రాజ‌కీయంగా అవ‌కాశాలు కోరుకునే వారికి జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో భారీ మేలు జ‌ర‌గ‌నుంది. త్వ‌ర‌లోనే జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రానున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. అన్ని పార్టీల‌కూ మేలు చేస్తుంద‌న్న వాద‌న ఉంది. ముఖ్యంగా కూట‌మి పార్టీల‌కు ఈ నిర్ణ‌యం మ‌రింత‌గా మేలు చేయ‌నుంది.

జిల్లా ప‌రిష‌త్ ప‌ద‌వులు..

జిల్లా ప‌రిష‌త్‌లో చైర్మ‌న్‌, జిల్లా ప‌రిష‌త్ స‌భ్యులుగా ఒక్కొక్క జిల్లాలో ఆయా జిల్లాల ప‌రిధి, జ‌నాభాను అనుస‌రించి 13 నుంచి 25 మంది వ‌ర‌కు స‌భ్యులు ఉంటాయి. అంటే.. ఒక జిల్లా ప‌రిష‌త్‌లో 25 మంది నాయ‌కులు ఉంటారు. కొత్త‌గా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనూ ఇదే ఫార్ములాను పాటించ‌నున్నారు. త‌ద్వారా కూట‌మి పార్టీల్లోని ఆశావ‌హుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. అలానే.. అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి.. పోటీ కూడా త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇక‌, వార‌సుల‌కు కూడా ఈ జిల్లా ప‌రిష‌త్‌లు క‌లిసి రానున్నాయి. మొత్తంగా.. నాడు జ‌గ‌న్ స‌గం చేసి వ‌దిలేసిన ప‌నిని సీఎం చంద్ర‌బాబు పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం.