`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం, ఆర్ ఎస్ ఎస్ వంటి సైద్ధాంతిక సంస్థ‌ల పెత్త‌నం తొలిగిపోయిన‌ట్టేనా? అంటే.. తాజాగా జ‌రిగిన కీల‌క నియామ‌కం ఔన‌నే స‌మాధానమే ఇస్తోంది. 2024, జ‌న‌వ‌రిలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేసుకున్న‌ అయోధ్య బాల‌రామ‌య్య ఆల‌యం ఇటీవ‌ల వివాదాల్లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. రామ‌య్య‌పై భక్తితో దేశ విదేశాల నుంచి వ‌చ్చిన భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాలు దారిమ‌ళ్లాయి.

నిస్సిగ్గుగా.. నిర్భీతిగా కొంద‌రు ఆల‌య విరాళాల‌ను ప‌ట్ట‌ప‌గ‌లే దోపిడీ చేశారు. ఈ విష‌యాన్ని సీబీఐ అధికారులు సైతం నిర్ధారించారు. దీంతో ఆల‌య ఆర్థిక భ‌ద్ర‌త తీవ్ర ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు..ఈ వ్య‌వ‌హారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌తిష్ఠ‌ను కూడా మ‌స‌క బార్చేలా చేసింది. క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ తానేన‌ని ఆయ‌న రామ‌య్య ఆల‌య ప్రారంభోత్స‌వం వేళ ప్ర‌క‌టించుకున్న ద‌రిమిలా.. తాజాగా వెలుగు చూసిన అక్ర‌మాలు రాజ‌కీయంగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేశాయి. ఈ నేప‌థ్యంలో అయోధ్య రామాల‌య పాల‌న‌ను సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఆల‌య ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(సీఈవో)ని శాశ్వ‌తంగా నియ‌మించాల‌ని.. సంపూర్ణ హ‌క్కులు ఆ ప‌దవిని చేప‌ట్టే వారికి ఇవ్వాల‌ని రామ‌జ‌న్మ‌భూమి తీర్థ్ ట్ర‌స్టు నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో నెల రోజుల కింద‌ట నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ప‌ద‌విని పొందేవారి అర్హ‌త‌లు పేర్కొంటూ.. ఇచ్చిన నోటిఫికేష‌న్‌కు 5 వేల‌కుపైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. వీటిలో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, మ‌రికొంద‌రు సిఫార‌సు నేత‌లు కూడా ఉన్నార‌ని ట్ర‌స్టు వ‌ర్గాలు తెలిపాయి. మొత్తంగా వీట‌న్నింటి వ‌డ‌బోత‌కు.. ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద‌వుల్లో ఉన్న వారిని ఎంపిక చేసి క‌మిటీగా ఏర్పాటు చేశారు. ఇలా.. ఈ క‌మిటీ తాజాగా జితేంద్ర మిశ్రాను ఎంపిక చేసింది.

రాజ‌కీయాల‌కు దూరంగా..

జితేంద్ర మిశ్రా.. భార‌త వైమానిక ద‌ళంలో కీల‌క పోస్టులు నిర్వ‌హించారు. ఆప‌రేష‌న్ సిందూర్ స‌మయంలో ఆయ‌న వెస్ట్ర‌న్ క‌మాండ్‌కు నేతృత్వం వ‌హించారు. 35 ఏళ్ల‌ నుంచి వైమానిక ద‌ళంలో సేవ‌లు అందిస్తూ.. నిస్వార్థ ప‌రుడిగా, నిజాయితీ.. దేశ భ‌క్తితో పాటు ఆధ్యాత్మిక భ‌క్తి కూడా ఉన్న నేప‌థ్యంలో జితేంద్ర మిశ్రాను సీఈవో ఎంపిక క‌మిటీ ఎంపిక చేసింది. త‌ద్వారా అయోధ్య‌కు రాజ‌కీయ వాస‌న‌ల పొడ అంట‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కాగా..ఈ పోస్టు కోసం.. సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌హా.. మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా భారీ సంఖ్య‌లో పోటీ ప‌డ‌డం గ‌మ‌నార్హం.

ఈ పోస్టుకు కేబినెట్ హోదా!

అయోధ్య ఆల‌య సీఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్టే వారికి.. ఆల‌యం త‌ర‌ఫున ల‌గ్జ‌రీ ఇంటిని, ఇద్ద‌రు డ్రైవ‌ర్ల‌ను, 1+1 భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తారు. ఇక‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. కేబినెట్ హోదాను క‌ల్పిస్తుంది. నెల‌కు 2.25 ల‌క్ష‌ల వేత‌నంతోపాటు.. నిరంత‌రం అందుబాటులో ఉండేలా.. గ్రూప్‌-1 అధికారుల స్థాయి కార్య‌ద‌ర్శులు ఉంటారు. ఆల‌యానికి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాలు, నియామ‌కాలు సైతం సీఈవోనే చూసుకుంటారు. ఆల‌య ప్ర‌తిష్ఠ‌ను, భ‌క్తుల మ‌నోభావాల‌ను ప‌రిర‌క్షించాల్సి ఉంటుంది.