త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల ఇరు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటీవల వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలకు సంబందించిన ఇంచార్జిలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని జగన్ ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో ఎలాగైనా సరే పులివెందుల నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని అధికార టీడీపీ పట్టుదలగా వుంది. తద్వారా జగన్ ను నైతికంగా దెబ్బ తీయాలన్న ప్లాన్ చేస్తుంది. అధికారం చేతిలో వుంది, కుటుంబ కలహాలు, వివేకా హత్య ప్రభావం, గత ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ కార్యకర్తలు నిస్పృహలో వున్నారు. దీన్ని క్యాచ్ చేసి కాష్ చేసుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది.
ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన చోట ఇంచార్జికి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వను అన్న ప్రకటన ఇప్పుడు జగన్ తలకు చుట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ వ్యూహం అర్ధం చేసుకున్న జగన్ అండ్ కో నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యింది. అందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతికి ఇడుపులపాయ వెళుతున్న జగన్ పనిలో పనిగా రెండ్రోజులు పులివెందులలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పులివెందుల మున్సిపాలిటీలోని అన్నీ స్థానల్లో టీడీపీపై అభ్యర్థులను పోటీకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
వైయస్ వర్ధంతికి ఒకరోజు ముందుగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ పులివెందుల చేరుకోనున్నారు. సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో వుండేలా షెడ్యూల్ లో ఇచ్చారు. ఈ సమయంలో పార్టీ కీలక నాయకులు, కొందరు సన్నిహితులతో చర్చలు జరుపుతారని తెలుస్తుంది. మరుసటి రోజు ఇడుపులపాయ చేరుకొని తండ్రికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు.
ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. స్థానిక నాయకులతో సమావేశమై స్థానిక ఎన్నికల్లో అన్నీ స్థానాలకు పోటీ చేయడం గురించి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోని టీం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు వినికిడి. టీడీపీ అభ్యర్థులకు ధీటైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటుగా బలహీనంగా వున్న స్థానాలను గుర్తించే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. పులివెందుల స్థానాన్ని నిలబెట్టుకునేందుకు చివరి నిముషం వరకు పోరాడాలని జగన్ సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికార టీడీపీ కూడా ఇప్పటికే బీ టెక్ రవికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల మీద పచ్చ జెండా ఎగరేయాలని ఆదేశించినట్లు సమాచారం. చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దని, పులివెందులలో టీడీపీని గెలిపించి వచ్చి కలవమని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పులివెందులలో స్థానిక ఎన్నికల యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని స్థానికులు చెప్పుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
