నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ న‌ది.. నేపాల్‌లోని మూడు జిల్లాలు.. రసువా, ధాదింగ్, నువాకోట్ ల‌ను ముంచెత్తింది. దీంతో వంద‌లాది మంది ప్ర‌జ‌లు, భార‌త ప‌ర్యాట‌కులు గ‌ల్లంత‌య్యారు. అయితే.. ఈ ప‌రిణామాల‌పై నెమ్మ‌ది నెమ్మ‌దిగా అనేక అనుమానాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ ప్రాంతం చైనా ఆక్ర‌మిత టిబెట్ కు ప‌క్క‌నే ఉండ‌డం.. టిబెటిన్ల‌కు ఇటీవ‌ల కాలంలో నేపాల్ మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. తెలిసిందే. దీంతో  చైనా కుట్ర చేసిందా? అనే కోణంలో జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాలు క‌థ‌నాలు వెలువ‌రుస్తున్నాయి.

ఏం జ‌రిగింది?

నేపాల్‌లో మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు ప‌రిస్థితి బాగానే ఉంది. అక‌స్మాత్తుగా బుధ‌వారం ఉద‌యం తెల‌తెల వారుతుండ‌గానే.. కోశీన‌ది నుంచి నీరు, రాళ్లు, బుర‌ద వంటివి దూసుకువ‌చ్చాయి. నిజానికి ఈ న‌ది నుంచి నీరు బ‌య‌ట‌కు రావాలంటే చైనా గేట్లు ఎత్తితేనే జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు, అనుమానాల‌కు కూడా దారితీసింది. అయితే..తాము కూడా బాధితుల‌మేన‌ని చైనా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. క్షణాల్లో వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తింది. దీంతో వంద‌లాది మంది నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో మాన‌స స‌రోవ‌ర యాత్ర‌కు వెళ్లిన భార‌తీయ ప‌ర్యాట‌కులు కూడా వంద‌మందికి పైగా ఉన్నార‌ని అధికారులు తెలిపారు.

టిబెట్‌లోని గైరాంగ్ పోర్టు చైనా అధీనంలో ఉంది. దీని నుంచి వ‌ర‌ద త‌న్నుకువ‌చ్చింద‌ని అధికారులు చెబుతున్నారు. ఇది ఉద్దేశ పూర్వ‌క‌మే అయి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే.. చైనాతో పెద్ద ల‌డాయి త‌ప్ప‌ద‌న్న సంకేతా ల‌ను నేపాల్ ఇస్తోంది.

ఇక‌, ప్ర‌స్తుతం రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. మ‌రోవైపు.. భార‌త్ ఆప‌న్న హ‌స్తం అందించింది. చైనాపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల విష‌యంలో భార‌త్ మౌనం వ‌హిస్తోంది. ప్ర‌కృతి విల‌యం కోణంలోనే చూడాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మీడియా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర స‌మాచార శాఖ భార‌తీయ మీడియాను కోరింది.

ప్ర‌ధాని ఫోన్‌..

నేపాల్ లో నెల‌కొన్న జ‌ల ప్ర‌ళ‌యం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త‌క్ష‌ణ‌మే రియాక్ట్ అయ్యారు. నేపాల్‌కు భార‌తీయ స‌మాజం, ప్ర‌జ‌లు అండ‌గా ఉంటార‌ని.. అత్య‌వ‌స‌ర స‌హాయం అందించేందుకు రెండు ప్ల‌టూన్ల సైన్యాన్ని, వైద్య స‌హాయాన్ని విప‌త్తు స్సంద‌న ద‌ళాల‌ను కూడా పంపిస్తామ‌ని తెలిపారు. నేపాల్ ప్ర‌ధాన మంత్రికి ఫోన్ చేసిన ఆయ‌న‌.. విప‌త్తు స‌మ‌యంలో ఆదుకునేందుకు భార‌త్ అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తుంద‌ని పేర్కొన్నారు. అయితే.. ప్ర‌ధాని సైతం చైనా విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.