బ్యాలెట్ పోరుపై వైసీపీ ఆశ‌లు ఫ‌లించేనా…?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి ఎన్నిక‌ల సంఘం కూడా ఓకేచెప్పింది. ఇప్ప‌టికే బ్యాలెట్ బ్యాక్సుల‌ను సేక‌రిస్తున్నారు. త్వ‌రలోనే నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. పోటీ చేసే పార్టీలు, అభ్య‌ర్థుల పేర్ల‌తో బ్యాలెట్ ప‌త్రాల‌ను కూడా ముద్రించ‌నున్నారు. సో.. ఇదంతా ఒక‌ర‌కంగా గ‌త ఐదేళ్ల త‌ర్వాత‌.. జ‌రుగుతున్న కీల‌క ఎన్నిక‌లేన‌ని అనాలి. గత స్థానిక ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను వినియోగించారు.

ఇక‌, ప్ర‌స్తుత బ్యాలెట్ విధానంపై వైసీపీ భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల‌పై అనేక అనుమానాలు వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌.. ఏం జ‌రిగిందో ఏమో.. ఆదేవుడికే తెలియాలి అంటూ.. వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే తాము ఓడిపోయామ‌న్న వాద‌న‌ను కూడా ఆయన వినిపించారు. అయితే.. ఇప్పుడు.. బ్యాలెట్ ఎన్నిక కావ‌డంతో వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటుంద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు గ‌తంలో మెరుగైన పాల‌న అందించామ‌ని చెప్పాలంటూ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ నేప‌థ్యంలో బ్యాలెట్ ఏమేర‌కు వైసీపీకి మేలు చేస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. నిజానికిస్థానిక ఎన్నిక‌లు అన‌గానే.. లోక‌ల్‌గా అధికారంలో ఉన్న పార్టీ నాయ‌కుల హ‌వా క‌నిపిస్తుంది. దీని ప్ర‌భావ‌మే ఓట‌ర్ల‌పై కూడా క‌నిపిస్తుంది. సో.. ఇప్పుడు కూడా దీనిని విడ‌దీసి చూడ‌లేని ప‌రిస్థితి ఉంటుంది. అయితే.. కూట‌మిలో నెల‌కొన్న కొన్ని అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లపై వైసీపీ భారీ ఆశ‌లు పెట్టుకుంది. పైగా బ్యాలెట్ కావ‌డంతో ఈ ఆశ‌లు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. కూట‌మి ప‌క్షాల దూకుడు ముందు వైసీపీ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది చూడాలి

వైసీపీ నేత‌ల ప‌రంగా చూస్తే.. కొన్ని జిల్లాల్లో బ‌లంగానే ఉన్నా.. ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో అంత ప్ర‌భావం చూపించ‌లేక పోతున్నారు. ఇక‌, సీమ‌లోనూ క‌ర్నూలు జిల్లాలో ప‌ట్టుమ‌ని ప‌ది మంది నాయ‌కులు కూడా యాక్టివ్‌ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అనంత‌పురంలో వ‌ర్గ పోరు, తిరుప‌తిలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వైసీపీని కుంగ‌దీస్తున్నాయి. ఇక‌, విజ‌య‌వాడ, గుంటూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల ప‌రిధిలో అయితే.. బాధ్య‌త‌లుతీసుకునే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. సో.. ఇవ‌న్నీ దాటుకుని బ్యాలెట్ ఆశ‌ల‌ను ఏమేర‌కు నెర‌వేర్చుకుంటున్న‌ది చూడాలి.