హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి అక‌స్మాత్తుగా కుప్ప‌కూలింది. అది కూడా.. ఆమె పైనే ప‌డ‌డంతో చేతికి స్వ‌ల్ప గాయ‌మైంది. అయితే.. ఆమె త‌ల‌పై ప‌డి ఉంటే ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండేద‌ని వైద్యులు తెలిపారు. ఆ వెంట‌నే ఆమెకు ప్రాధ‌మిక వైద్యం అందించి.. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చేతికి అయిన గాయానికి క‌ట్టుక‌ట్టిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాల‌న్నారు. కాగా..ఈ ఘ‌ట‌న‌తో అనిత భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు.

ఏం జ‌రిగింది?

తిరుప‌తిలో `అమరావతి ఛాంపియన్‌షిప్ 2026` పేరుతో రాష్ట్ర స్థాయి క్రీడా పోటటీల‌ను సోమ‌వారం ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుక‌ల్లో పాల్గొన్న హోం మంత్రి అనిత‌.. డ్రోన్ ఎగుర‌వేశారు. డోన్ ద్వారా అమ‌రావతి ఛాంపియ‌న్ షిప్‌-2026 జెండాను ఆవిష్క‌రించాల‌ని భావించారు. అయితే.. బ్యాట‌రీ చార్జింగ్ ను ముందుగానే ప‌రిశీలించుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. సంబంధిత అధికారులు ప‌రిశీలించ‌లేదు. దీంతో చార్జింగ్ స్వ‌ల్పంగా ఉండ‌డంతో డ్రోన్ పైకెగిరిన కొన్ని నిమిషాల్లోనే ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది.

గ‌తంలో కూడా..

గ‌త ఏడాది మంత్రి లోకేష్ కూడా.. ఒక డ్రోన్‌ను ఎగురు వేశారు. అయితే.. అప్ప‌ట్లోనూ దానికి చార్జింగ్ ఉన్న‌దీ లేనిదీ ప‌రిశీలించుకోక‌పోవ‌డంతో పైకెగిరిన కొన్ని నిమిషాల‌కే అది కుప్ప‌కూలింది. అయితే.. నిర్జ‌న ప్రాంతంలో ప‌డిపోవ‌డంతో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేదు. తాజా ఘ‌ట‌న‌లో మంత్రిపైనే ప‌డ‌డంతో ఆమె గాయ‌ప‌డ్డారు.

ఏంటీ క్రీడ‌లు..

`అమరావతి ఛాంపియన్‌షిప్ 2026` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల‌కు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పిస్తోంది. వివిధ క్రీడ‌ల్లో నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి.. రాష్ట్ర‌స్థాయి అవార్డులు ఇవ్వ‌నుంది. వీరిని జాతీయ‌స్థాయిలో పోటీ ప‌డేలా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి అవార్డులు మ‌రిన్ని రావాల‌న్న సంక‌ల్పంతో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల వారీగా క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించాల‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ఏపీని నెంబ‌ర్ 1 చేయాల‌న్న లక్ష్యంతో కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది.