ఒక ఫోన్ కోసం ఇంత రాద్దాంతం ఎందుకు అమ్మాయిలు…

సెల్ ఫోన్ కోసం కాలేజీ విద్యార్థినులు కొట్టుకున్నారు. రెండు జట్లుగా విడిపోయి రోడ్డు మీదకు వచ్చి జుట్టు జట్టూ పట్టుకొని పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యార్థినుల మధ్య ఏర్పడిన వివాదం కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే స్పందించారు. కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. ఇంతకూ ఏమి జరిగిందంటే…

కాకినాడ ఎస్. కే. కాలేజీ ఆఫ్ నర్సింగ్ లో తెలుగు విద్యార్థినులతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఒకే హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వీరి మధ్య సెల్ ఫోన్ చిచ్చు పెట్టింది. ఈ నెల 21వ తేదీన మణిపూర్ కు చెందిన ఒక విద్యార్థిని సెల్ ఫోన్ పోయింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థినులే సెల్ ఫోన్ తీసినట్లు మణిపూర్ అమ్మాయిలు అనుమానించారు.

దీంతో తెలుగు, మణిపూర్ విద్యార్థినులు రెండు గ్రూపులయ్యారు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగింది. అధికాస్త ఘర్షణకు దారి తీసింది. దాంతో విచక్షణ కోల్పోయిన విద్యార్థినులు గట్టిగా కేకలు పెడుతూ హాస్టల్ బయటకు చేరుకున్నారు. జుట్లు పట్టుకొని కొట్టు కున్నారు. ఒకరి మీద మరొకరు కర్రలు, చెప్పులు విసురుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయలయ్యాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనతో ఇరు రాష్ట్రాలు స్పందించాయి. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఏపీ సీఎం కార్యాలయంతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించారు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ హెరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ రంగంలోకి దిగి ఘర్షణకు దారితీసిన పరిస్థితుల మీద విచారణ చేశారు. వివాదానికి కారణమైన విద్యార్థినులతో మాట్లాడారు. శుక్ర, శనివారం రెండు రోజుల నుంచి వివాదం నడుస్తుంటే కాలేజీ యాజమాన్యం ఏమి చేస్తుందని, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలు చల్లార్చడానికి తక్షణ చర్యలు చేపట్టారు.

ఇరు రాష్ట్రాల విద్యార్థినులతో మాట్లాడిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినుల సమ్మతితో 31 మంది ఇతరా రాష్ట్రాల వారిని వేరే హాస్టల్ కు మార్చారు. కాలేజీ, హాస్టల్ ఆవరణలో మహిళా పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఘర్షణలు పునరావృతం కాకుండా విద్యార్థినుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పెందుకు సైకాలాజి నిపుణులతో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాట్లు అధికారులు తెలిపారు. తరగతి గదిలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉపాధ్యాయులతో కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందన పట్ల ఇతరా రాష్ట్రాల విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిన్న వైజాగ్ విద్యార్థులు రోడ్డెక్కి కొట్టుకోవడం, అది మరిచిపోక ముందే కాకినాడలో న్సర్సింగ్ విద్యార్థినులు ఫైటింగ్ చేసుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలతో రాష్ట్రానికి వున్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్తుంటుదని, పోలీసులు, ఇతరా శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాల్సిన అవసరం వుందని హెచ్చరించినట్లు సమాచారం. విచ్చలవిడి మద్యం, గంజాయి విక్రయాల వలన గొడవలు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.