కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్ చానెళ్ల స‌ర్వేలోనూ ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్ర‌ధానంగా ఐదు అంశాలు కూట‌మికి కీల‌కంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ అంశం త‌ర్వాత‌.. అనూహ్య‌మైన మార్పులు క‌నిపిస్తున్నాయ‌ని స్ప‌ష్ట‌మ వుతోంది. ఐదు కీల‌క అంశాలు.. మేజ‌ర్‌గా కూట‌మికి క‌లిసి వ‌స్తున్నాయి. అందుకే కూట‌మి పంచ‌క‌ల్యాణి!.

1) ఉచిత బ‌స్సు: వైసీపీ చేయ‌లేన‌ని చెప్పిన ఈ ప‌థ‌కాన్ని కూటమి భుజాల‌కు ఎత్తుకుంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సాధ్యం కాద‌న్న ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణాన్ని మ‌హిళ‌ల‌కు కేటాయించింది. త‌ద్వారా.. ఈ ప‌థకం కోట్ల మంది మ‌హిళ‌ల‌కు చేరువైంది. ఇది.. స‌ర్కారుకు క‌లిసి వ‌చ్చే కీల‌క ప‌రిణామం.

2) బీసీ రిజ‌ర్వేష‌న్‌: బీసీలకు 34 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. త‌ద్వారా పార్టీ పరంగానే కాకుండా.. కూట‌మికి కూడా.. ఇది మేలు చేయ‌నుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎక్కువ మంది బీసీల‌కు అవ‌కాశం ఇచ్చేందుకు ఇది దోహ‌ద ప‌డ‌నుంది. త‌ద్వారా బీసీలు గుండుగుత్త‌గా టీడీపీకే మొగ్గు చూప‌నున్నారు.

3) అన్న క్యాంటీన్లు: వైసీపీ హ‌యాంలో ఎత్తేసిన అన్న క్యాంట‌న్ల‌కు కూట‌మి పూర్వ వైభ‌వం తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 213 క్యాంటీన్లు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉన్నాయి. వీటిలో రూ.5కే భోజ‌నం.. టిఫిన్ అందిస్తున్నారు. ఇది కూట‌మికి మ‌రింత ప్ల‌స్ కానుంది. పైగా వీటికి ఆద‌ర‌ణ కూడా మెండుగానే ఉంది.

4) త‌ల్లికి వంద‌నం: వైసీపీ హ‌యాంలో అమ్మ ఒడి త‌ర‌హాలోనే ప్ర‌స్తుతం త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. అయితే.. గ‌తానికి ఇప్ప‌టికి తేడ ఏంటంటే.. అప్పట్లో ఇంట్లో ఒక్క‌రికే అమ‌లు కాగా.. ప్ర‌స్తుతం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ దీనిని అమ‌లు చేస్తున్నారు. ఇది కూడా కూట‌మికిమేలు చేసే ప‌రిణామం. పైగా కీల‌క ఆయువుప‌ట్టుగా మారింది.

5) ప్రాజెక్టులు: ఇక‌, కీల‌క‌మైన ఐదో అంశం.. ప్రాజెక్టులు. ఇటు వెలిగొండ‌, అటు పోల‌వ‌రం, మ‌రోవైపు పులి చింత‌ల‌, ప‌ట్టిసీమ‌, పోల‌వ‌రం-మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌.. ఇలా అనేక ప్రాజెక్టులు ప‌ట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల కార‌ణంగా.. సాగు తాగునీటికి ఇబ్బంది లేని ప‌రిస్థితులు ఉంటాయి. ఇది కూట‌మి స‌ర్కారుకు క‌లిసి వ‌చ్చే అంశంగా మారుతుంద‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ఐదు అంశాలు కూట‌మికి వైసీపీ మ‌ధ్య భారీ తేడాను సూచిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.