కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి. అయితే, తన కూతురి కామెంట్లు ఆమె వ్యక్తిగతమని, తనకు సంబంధం లేదని సురేఖ చెప్పారు. అంతేకాదు, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని కూడా సురేఖ కోరారు.

అయితే, సుష్మిత కామెంట్లను సురేఖ ఖండించాల్సింది పోయి తనకు సంబంధం లేదని చెప్పడంతో సురేఖపై చాలామంది కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోన కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది తిరుగుబాటు చేసేందుకు రెడీ అవుతున్నారట.

ఈ రోజు సురేఖకు వ్యతిరేకంగా ఓ సమావేశం జరగనుందని, అందులో 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇక, సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సురేఖ వివరణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చాలామంది ఎమ్మెల్యేలు ఆమెను వ్యతిరేకిస్తున్నారట. మరోవైపు, కొండా సురేఖకు పలువురు సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ నాయకుల మద్దతు ఉందని తెలుస్తోంది.

అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ సుష్మిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని పచ్చ కాంగ్రెస్ నేతగా పరోక్షంగా ఆమె అభివర్ణంచడం షాకింగ్ గా మారింది. ఈ రకంగా కాంగ్రెస్ ను నమ్ముకొని ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న నేతలంతా సురేఖ, సుష్మితల వర్గంగా ఏర్పడ్డారట.

అంతేకాదు, రేవంత్ అంటే ముందు నుంచి గిట్టని చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా సురేఖకు మద్దతిస్తున్నారట. మరి, ఈ క్రమంలో ఈ వ్యవహారం ఏ వైపునకు దారి తీస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా అంతర్గత కుమ్ములాటలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ ఆ ఆనవాయితీని మాత్రం కొనసాగిస్తూ పలుచనబడుతూనే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.