మండలిలో చైర్మన్ vs జనసేన మంత్రి

“మీరు నాకు పాఠాలు చెప్ప‌ద్దు స‌ర్‌!. అస‌లు మీరు(ప్ర‌భుత్వ ప‌క్షం) స‌రిగా ఉంటే.. వైసీపీ స‌భ్యులు కూడా స‌రిగానే ఉంటారు. త‌ప్పు ఎక్క‌డ జ‌రుగుతోందో ఆలోచించుకోండి.“ అంటూ.. ఏపీ శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు అధికార ప‌క్షం స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు.. స‌భా సంప్ర‌దాయాలు ఒక్క వైసీపీకి మాత్ర‌మే కాద‌ని.. ప్ర‌భుత్వ ప‌క్షానికి కూడా వ‌ర్తిస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఏం జ‌రిగింది?

మండ‌లిలో బుధ‌వారం వైసీపీ స‌భ్యులు డీఎస్సీపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతూ.. పోడియంను చుట్టుముట్టారు. ఈ స‌మయంలో జోక్యం చేసుకున్న మంత్రి మ‌నోహ‌ర్‌.. స‌భా మ‌ర్యాద‌లు పాటించ‌నివారిపై చైర్మ‌న్ అవ్యాజ ప్రేమ‌ను చూపిస్తున్నార‌ని.. వారిపైచ‌ర్య‌లు తీసుకునే అధికారం ఉన్నా.. ఉపేక్షిస్తున్నార‌ని పెద‌వి విరిచారు. అంతేకాదు.. గ‌త వైసీపీ హ‌యాంలో స‌భ‌లో ఎర్ర‌టి గీత‌లు గీశార‌ని.. వాటిని దాటి వ‌చ్చిన స‌భ్యుల‌ను అప్ప‌టిక‌ప్పుడు స‌స్పెండ్  చేసిన విష‌యాన్ని కూడా ఆయ‌న గుర్తు చేశారు.

ఆ త‌ర‌హాలో ఇప్పుడు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మంత్రి చైర్మ‌న్‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. ఈ స‌మ‌యంలో వైసీపీ ప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ జోక్యం చేసుకుని “చైర్మన్ ఎలా వ్య‌వ‌హరించాలో కూడా మీరే చెబుతారా?` అని వ్యాఖ్యానించారు. ఈ స‌య‌మంలో చైర్మ‌న్ మాట్లాడుతూ.. “మంత్రి గారూ..  ఎవ‌రు ఏం చేయాలో.. వారు అది చేస్తారు. ప్ర‌భుత్వ ప‌క్షం కూడా స‌రిగా వ్య‌వ‌హ‌రించాలి. వైసీపీ స‌భ్యుల‌కే కాదు.. మీరు కూడా స‌భా సంప్ర‌దాయాలు పాటించాలి“ అని అన‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్ర‌భుత్వ ప‌క్షం మౌనం!

ఇక‌, మండ‌లిలో బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. మండ‌లి వైస్ చైర్మ‌న్‌గా వైసీపీ స‌భ్యుడు తూమాటి మాధ‌వ‌రావు పేరును చైర్మ‌న్ మోషేన్ రాజు ప్ర‌క‌టించారు. ఈయ‌న మ‌ద్ద‌తుగా వైసీపీ స‌భ్యులు క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో స్వాగ‌తించారు. అయితే.. ఈ స‌మ‌యంలో కూట‌మి స‌భ్యులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో చైర్మ‌న్‌ స్పందిస్తూ.. “తూమాటి మాధ‌వ‌రావు వైస్ చైర్మ‌న్‌గా ఎంపిక‌య్యారు. అంద‌రూ ఆయ‌న‌ను అభినందించాలి“ అని సూచించారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వ ప‌క్షం మాత్రం మౌనంగానే ఉండిపోయింది.

కాగా.. ప్ర‌కాశం జిల్లా స్థానిక సంస్థ‌ల కోటాలో తూమాటి మాధ‌వ‌రావు మండ‌లికి ఎంపిక‌య్యారు. ఆయ‌న‌ను వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ నామినేట్ చేయ‌గా.. తాజాగా చైర్మన్ ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి దీనికి కూట‌మి నుంచి పోటీ పెట్టాల‌ని అనుకున్నా.. చివ‌రి నిమిషం వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో తూమాటి ఒక్క‌రే నామినేష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎంపిక‌య్యారు.