భారత ఎన్నికల విధానం అమెరికాలో రావాలి: ట్రంప్

అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లో అమలవుతున్న ఓటరు గుర్తింపు విధానాన్ని ఆయన ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.

తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ట్రంప్‌ చేసిన పోస్టులో.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇటీవల అమెరికా ఎన్నికల్లో చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు లేకుండా ఓటింగ్‌ ఎలా జరుగుతుందని తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రతి ఓటరుకు ఫొటో గుర్తింపు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. వారిలో ఒక శాతానికి కూడా తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని, ప్రతి ఓటరుకూ చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రం ఉండాల్సిందేనని తెలిపారు.

అమెరికాలో ఓటరు నమోదు సమయంలో పౌరసత్వానికి ఆధారం చూపించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధనను అమలు చేయడం, పోస్టల్‌ ఓటింగ్‌పై పరిమితులు విధించడం వంటి ప్రతిపాదనలు ‘సేవ్‌ అమెరికా చట్టం’లో ఉన్నాయి. ఈ చట్టాన్ని వెంటనే ఆమోదించాలని ట్రంప్‌ కాంగ్రెస్‌ను కోరారు.

అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, గుర్తింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంపై కొంతకాలంగా రాజకీయ చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపుతూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.