ఉప్పు నిప్పులా ఒకరి మీద మరొకరు ఎప్పుడూ చిటపటలాడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు నవ్వుతూ పలకరించు కోవడం, కుశల సమాచారాలు మాట్లాడుకోవడం రెండు రోజుల క్రితం ఒక శుభాకార్యంలో కనిపించింది. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం చూసి విసుగెత్తిన వారికి ఇది ఉత్సాహం కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యింది. ఇంతకూ ఏం జరిగిందంటే…
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ ) ఎంపీ సుప్రియా సూలే కూతురు రేవతి సూలే రిసెప్షన్ వేడుకకు ప్రధాన మంత్రి మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ హై ప్రొఫైల్ వేడుకలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రియాంక గాంధీని పలకరించారు. ప్రియాంక ఎలా వున్నావు అని మోదీ అడగ్గా నేను బాగున్నాను, మీరు ఎలా వున్నారంటూ బదులిచ్చారు. నేను ఇప్పటికీ అలాగే వున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.
వీరిద్దరి సంభాషణ విన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కల్పించుకొని ప్రధాని మోదీతో…లేదు మీరు కొంచెం మారారు అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఈ సరదా ఘటన మీడియాలో రెండు రోజులుగా తెగ వైరల్ అవుతుంది. జాతీయ మీడియా ప్రధానంగా హైలెట్ చేస్తూ వార్త ప్రచురించింది. హై ప్రొఫైల్ నాయకులు అప్పుడప్పుడు ఇలా కలిసి కబుర్లు చెప్పుకోవడం కిందిస్తాయి కార్యకర్తలకు పాజిటివ్ సంకేతాలు పంపించినట్లు అవుతుందని, ఇది మంచి పరిణామం అని ప్రజాస్వామిక వాదులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates